మోర్తాడ్, మార్చి 12: దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన పురుగు మందు పారాక్వాట్‌పై కేంద్రప్రభుత్వం వెంటనే దేశవ్యాప్తంగా శాశ్వత నిషేధం విధించాలని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడారు. పారాక్వాట్‌కు దీర్ఘకాలంగా గురయ్యే రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. పలు శాస్త్రీయ పరిశోధనల ప్రకారం పారాక్వాట్ వినియోగంతో పార్కిన్స్న్ డిసీజ్, కొన్ని రకాల క్యాన్సర్లు, కిడ్నీ నష్టం, థైరాయిడ్ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతున్నట్లు తేలిందని తెలిపారు. ముఖ్యంగా పారాక్వాట్‌ను తరుచుగా ఉపయోగించే వ్యవసాయ కార్మికుల్లో పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం గణనీయంగా ఉంటుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యం, ప్రాణాల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కావాలని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగించి పారాక్వాట్‌ను శాశ్వతంగా నిషేధించాలని డిమాండ్ చేశారు.
పారాక్వాట్ గడ్డిమందు కారణంగా వేలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, బాధతో ఈ మందు తాగిన రైతులు, ఇతరులను తిరిగి బతికించుకునే అవకాశం లేదని, కారణం ఈమందుకు యాంటీడోస్ లేదని తెలిపారు. ఈ మందు చాలా ప్రమాదకరమైనదని, దాదాపు 60దేశాలకు పైగా బ్యాన్ చేశారని, అటువంటి మందును మనదేశంలో బ్యాన్ చేయకపోవడంతో రైతులు ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని తెలిపారు. పారాక్వాట్ గడ్డిమందు ఆన్లైన్లో కూడా ఇక్కడ లభిస్తుందంటే పరిస్థితి ఏమిటో స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. ఈ గడ్డిమందుస్థానంలో ప్రమాదకరం కాని ఇతర గడ్డిమందులను రైతులకు అందుబాటులోకి సబ్సిడీపై తీసుకురావాలని, గడ్డిని తొలగించే పనిముట్లు కూడా సబ్సిడీపై అందజేయాలని డిమాండ్ చేశారు. ఈమందు విషయంలో డాక్టర్ల సంఘాలు కూడా తీర్మానాలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని, ఇటువంటి మందును వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. పారాక్వాట్ మందు నిషేధించాలని పార్టీలకు అతీతంగా సభ్యులంతా మద్దతు తెలుపడంపై హర్షం వ్యక్తంచేశారు. రైతు రాజ్యంలో రైతులు ప్రాణాలు కోల్పోయేలా తయారు చేసిన మందును బహిష్కరించి రైతులను, వారి కుటుంబాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.