వినాయక్ నగర్/కామారెడ్డి, అక్టోబర్ 14: ఉమ్మడి జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల నిర్వహణ కోసం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నది. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం 30 దరఖాస్తులు వచ్చినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 36 మద్యం షాపులకు 100 దరఖాస్తులు వచ్చిన్నట్లు తెలిపారు. ఆర్మూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 25 వైన్స్ షాపులకు 61, బోధన్ స్టేషన్ పరిధిలో మొత్తం 18 వైన్స్ షాపులకు 44, భీమ్‌గల్ స్టేషన్ పరిధిలో మొత్తం 12 వైన్స్ షాపులకు 32, మోర్తాడ్ స్టేషన్ పరిధిలో మొత్తం 11 వైన్స్ షాపులకు 25 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. జిల్లాలోని 102 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు మొత్తం 262 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో ఉన్న 49 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు 193 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత్‌రావు తెలిపారు. కామారెడ్డి పరిధిలో 15 వైన్ షాపులకు 54, దోమకొండ పరిధిలో 8 వైన్ షాపులకు 32,ఎల్లారెడ్డి పరిధిలో 7 వైన్ షాపులకు 25,బాన్సువాడ పరిధిలో 9 వైన్ షాపులకు 44, బిచ్కుంద పరిధిలో 10 వైన్ షాపులకు 38 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. దరఖాస్తు దారులకు టోకెన్లు అందజేసినట్లు పేర్కొన్నారు.