నిత్యావసరాల్లో ఒకటైన వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. మన దేశంలో ఆయిల్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇందుకోసం ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తున్నది. దీంతో ప్రజలపై ఆర్థిక భారం పడుతున్నది. ప్రజలపై భారం తగ్గించడంతోపాటు రైతులకు అధిక లాభాలు అందించే ఆయిల్‌పామ్ సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాయి. అన్నదాతలను ప్రోత్సహించి ఆయిల్‌పామ్ సాగువైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నాయి. ఈ మేరకు పంట సాగు లక్ష్యాన్ని కేటాయించింది.
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా సాగునీరు అందుబాటులోకి తేవడంతోపాటు అనేక రైతు సంక్షేమ పథకాలను అమలుచేస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. వంటనూనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగువైపు రైతులను మళ్లించేందుకు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక రాయితీలతోపాటు సాగు ఖర్చులను సైతం అందజేస్తున్నది. ఈ ఏడాది వానకాలం సీజన్‌కు ముందే రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసేలా రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో వ్యవసాయం, ఉద్యానవనం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటుచేసి రైతులను చైతన్యపరుస్తున్నారు.
రాయితీపై మొక్కలు..
ఏవోలు, ఏఈవోలు, ఎంపీడీవోలు, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు ఊరూరా పర్యటిస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీలు, ఆయిల్‌పామ్ సాగుతో వచ్చే లాభాలను రైతులకు వివరిస్తున్నారు. దీని ఫలితంగా గత వానకాలంలో నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో 684 మంది రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగు చేశారు. ఒక్కో మొక్కకు రూ.193 చొప్పున కోటీ 70 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. డ్రిప్ ఇరిగేషన్ కోసం సబ్సిడీ రూపంలో రూ.76 లక్షలు చెల్లించింది.
4,500 ఎకరాల్లో సాగులక్ష్యం..
ఈ ఏడాది యాసంగిలో 4,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి మండలంలో ఐదు గ్రామాలను ఎంపిక చేసుకొని రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అవగాహన కార్యక్రమాలను ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నర్సింగ్‌దాస్, డీఏవో తిరుమల ప్రసాద్ పర్యవేక్షించారు.
మండలాల వారీగా..
కలెక్టర్ నారాయణరెడ్డి ప్రతి మండలానికీ పంట సాగు లక్ష్యాన్ని కేటాయించారు. ఆర్మూర్ మండలంలో 250 ఎకరాలు, మాక్లూర్‌లో 200, నందిపేట్‌లో 200, బాల్కొండలో 40, మెండోరాలో 150, ముప్కాల్‌లో 150, ఏర్గట్లలో 250 ఎకరాల్లో ఆయిల్‌పామ్ పంట సాగు చేయనున్నారు. భీమ్‌గల్‌లో 150 ఎకరాలు, కమ్మర్‌పల్లిలో 150, మోర్తాడ్‌లో 300, వేల్పూర్‌లో 300 ఎకరాల లక్ష్యం నిర్దేశించారు. బోధన్ మండలంలో 200 ఎకరాలు, నవీపేట్లో 300, రెంజల్లో 200, ఎడపల్లిలో వంద, ధర్పల్లిలో 200, ఇందల్వాయిలో 250, సిరికొండలో 300, డిచ్‌పల్లిలో 150, మోపాల్‌లో 150, జక్రాన్‌పల్లిలో 150, నిజామాబాద్ రూరల్‌లో వంద, కోటగిరిలో వంద , రుద్రూర్లో 50, వర్నిలో 50, చందూర్‌లో 30, మోస్రాలో 30 ఎకరాల్లో పంట సాగు చేయించాలని అధికారులు ప్రణాళికలు
సిద్ధం చేశారు.
రాయితీ వివరాలు..
లక్ష్యాన్ని సాధిస్తాం..
యాసంగిలో నిర్దేశించిన ఆయిల్‌పామ్ పంట సాగు లక్ష్యాన్ని సాధిస్తాం. అన్ని శాఖల సహకారంతో ప్రస్తుతం రైతులకు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రైతుల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నది. వచ్చే మార్చి వరకు లక్ష్యాన్ని పూర్తిచేస్తాం. ఈ నెల 7వ తేదీ వరకు 1150 ఎకరాల్లో పంట సాగు కోసం 482 మంది రైతులు డీడీలు చెల్లించారు. మరో 1500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేయిస్తాం. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకొని రైతులు ముందుకు రావాలి.
-నర్సింగ్‌దాస్, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి