కంఠేశ్వర్ ఆగస్టు 19 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లో మంగళవారం ఉదయం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం ఉదయం ఒకేసారి ఆకస్మితంగా గాంధీ గంజుకు మార్కెట్ యార్డ్ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఒకేసారి రావడంతో ఏమి జరుగుతుందో తెలియక కొద్దిసేపు అయోమయ పరిస్థితి నెలకొన్నది. మార్కెట్ యార్డ్ అధికారులు కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను తమ స్థానాలు వదిలి పక్కకు జరిపి కూర్చోవాలని చెప్పడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది.
ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులను వివరణ కోరగా గాంధీ గంజ్కి సంబంధించి స్థలం ఎంతవరకు ఉంది వివరాలు సర్వే చేయడానికి వచ్చామని దీనికి సంబంధించిన పూర్తిస్థాయి డాక్యుమెంట్స్ మార్కెట్ యార్డు వాళ్లు ఇవ్వలేదని, అందువల్ల తిరిగి వెళుతున్నామని తెలిపారు. మార్కెట్ యార్డ్ సెక్రెటరీ అపర్ణను వివరణ కోరగా గాంధీ గంజ్లో కూరగాయ వ్యాపారులు అస్తవ్యస్తంగా కూర్చొని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారని అందువలన వాళ్లను సరైన స్థలంలో కూర్చోబెట్టడానికి వచ్చామని తెలిపారు.
గాంధీ గంజికు సంబంధించి సర్వే చేయడానికి మార్కెట్ యార్డ్ నుండి జిల్లా కలెక్టర్ కు ఇవ్వగా కలెక్టర్ టౌన్ ప్లాన్ అధికారులను సర్వే చేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. గంజ్ మార్కెట్ కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సౌత్ తహసీల్దార్ బాలరాజ్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ సెక్రటరీ అపర్ణ తదితరులు ఉన్నారు.