కంటేశ్వర్ : జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను పరిశీలించి, ఏవైనా మార్పులు, చేర్పులు అవసరం ఉంటే సూచనలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit ) రాజకీయ పార్టీలను కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11 వ తేదీన జిల్లాలోని 31 మండలాలు, వాటి పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు.
31 మండలాల పరిధిలో 307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని, 8,51,770 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ మేరకు మొత్తం 1,564 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 400 లోపు ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 122 ఉండగా, 500 లోపు ఓటర్లతో కూడిన పోలింగ్ కేంద్రాలు 362 ఉన్నాయని, 750 వరకు ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 1,080 ఉన్నాయని వివరించారు.
ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని కోరారు. అభ్యంతరాలు వచ్చిన పక్షంలో వాటిని పరిష్కరించి, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సాయాగౌడ్, డిప్యూటీ సీఈవో సాయన్న, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.