వినాయక్‌నగర్/ఖలీల్‌వాడి, మే 10: నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. నర్సు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలానికి చెందిన శిల్ప(27) కొంత కాలంగా దవాఖానలో పనిచేస్తున్నది. శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉండగా.. శనివారం ఉదయం ఆమెను తోటి సిబ్బంది నిద్రలేపేందుకు ప్రయత్నించగా ఎంతకూ లేవలేదు.
పరీక్షించిన దవాఖాన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించి, కుటుంబీకులకు సమాచారం అందించారు. శిల్ప మృతిపై కుటుంబీకులు అనుమానం వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు దవాఖానకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి చెల్లి సూర్యవంశీ రాహు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో బి.రఘుపతి తెలిపారు. శుక్రవారం నైట్ డ్యూటీలో ఉన్న మిగతా సిబ్బందిని సైతం విచారించి, వారి స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని పేర్కొన్నారు.