నిజాంసాగర్/ లింగంపేట, ఆగస్టు 1: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ హెచ్చరించారు. నిజాంసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. జూలై 27వ తేదీ నుంచి విధులకు హాజరుకాని జూనియర్ అసిస్టెంట్ సుభాష్‌ను సస్పెండ్ చేశారు. విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని ల్యాబ్ టెక్నిషియన్ నవ్యశ్రీని సంజాయిషీ కోరారు. దవాఖానలో అందుబాటులో ఉన్న మందుల వివరాలను వైద్యాధికారి రోహిత్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విద్య, బాన్సువాడ ఆర్డీవో రమేశ్‌రాథోడ్, ఎంపీడీవో, తహసీల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.
నాగన్న బావి వద్ద పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్ఫోసిస్ వైస్ చైర్మన్ కల్పానా రమేశ్, వాత్సల్యతో కలిసి పనులను పరిశీలించారు. కామారెడ్డి – ఎల్లారెడ్డి ప్రదాన రహదారి నుంచి నాగన్న బావి వరకు ఉపాధి హామీ పథకం నిధులతో రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలని, బావికి నాలుగు వైపులా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్‌వెంట పంచాయతీరాజ్ డీఈఈ గిరిధర్, ఎంపీడీవో నరేశ్, తహసీల్దార్ నరేందర్, ఏపీవో అన్నపూర్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాగౌడ్, నాయకులు ఎల్లమయ్య, కౌడ రవీందర్, అశోక్, సాయికుమార్ తదితరులు ఉన్నారు.