నిజాంసాగర్, నవంబర్ 18: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మూడు నెలలుగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టింది. వారం రోజులుగా కేవలం ప్రాజెక్టు ఆరో నంబర్ వరద గేటు ద్వారా మాత్రమే నీటి విడుదల కొనసాగింది. సోమవారం సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గడంతో ప్రాజెక్టు ఆరో నంబర్ వరద గేటును గ్యాంగ్మెన్ల ద్వారా కిందికి దించి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేసేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ ప్రాజెక్టు గేటు మొరాయించింది.
రాత్రి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో దానిని సోమవారం రాత్రి అలాగే ఉంచి, మంగళవారం ఉదయం తిరిగి మూసివేసేందుకు ప్రయత్నించారు. గ్యాంగ్మెన్లు కష్టపడి సుత్తెలు, జాకులతో గేటును కిందికి దించారు. దీంతో నీటి విడుదల ఆగిపోయింది. లేదంటే జేసీబీ సహాయంతో గేటు మూసి వేయాల్సి వచ్చేదని గ్యాంగ్మెన్లు అభిప్రాయం వ్యక్తంచేశారు. ఉదయం గ్యాంగ్మెన్లు వరద గేటును కిందికి దించే పనులు చేయగా.. అక్కడ విధులు నిర్వహించాల్సిన వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు మాత్రం పత్తా లేకుండా పోయారు.
నీటి విడుదల నిలిపివేత..
నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న నీటి విడుదలను మంగళవారం ఉదయం పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగుల (17.80 టీఎంసీల) పూర్తిస్థాయిలో నీరు నిలువ ఉన్నట్లు ఏఈఈలు అక్షయ్, సాకేత్ తెలిపారు. ఎగువ భాగం నుంచి ఇన్ఫ్లో కొనసాగితే అందుకు అనుగుణంగా నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు.