ఖలీల్వాడి, డిసెంబర్ 15 : ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఖలీల్వాడిలో నిర్మించ తలపెట్టిన వెజ్-నాన్వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలాన్ని, అహ్మదీబజార్ వద్ద ఖిల్లా రోడ్డును ఆనుకుని ఆధునాతన సదుపాయాలతో నిర్మించిన సమీకృత మార్కెట్ సముదాయ భవనాన్ని, అర్సపల్లి, ఖిల్లా, కోటగల్లీ ప్రాంతాల్లో కొనసాగుతున్న వైకుంఠధామాల నిర్మాణాలను పరిశీలించారు. వైకుంఠధామం పనులు మందకొడిగా సాగుతుండడంతో సంబంధిత అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను మందలించారు. తాపీగా పనులు చేస్తే ఎప్పటిలోగా పూర్తి చేస్తారని నిలదీశారు. గడువులోగా పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు. వచ్చే మే నెల నాటికి ఖిల్లా వైకుంఠధామంఅన్ని వసతులతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేయించాలని ఆదేశించారు. వారం రోజుల్లో తాను మళ్లీ పరిశీలనకు వస్తానని, పనుల్లో పురోగతి కనిపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తుది దశకు చేరిన అహ్మదీబజార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని జనవరి 15వ తేదీలోగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని స్పష్టమైన గడువు విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని, నిర్ణీత సమయంలోగా నిర్మాణాలు పూర్తి కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆయా విభాగాల పనులు ఏకకాలంలో కొనసాగేలా పర్యవేక్షణ చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.