నిజామాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2019 సెప్టెంబర్లో మొదటి విడుత ప్రారంభించగా, రెండో విడుత గత ఏడాది జనవరి, మూడో విడుత జూన్లో నిర్వహించారు. రెండు, మూడో విడుతల కార్యక్రమాల నిర్వహణ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి కాసింత అడ్డు తగిలినప్పటికీ ప్రగతి కార్యక్రమాలు జోరుగానే సా గాయి. నాలుగో విడుత పల్లె ప్రగతిని మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. మరోవైపు పల్లె సీమల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు వంటి సౌకర్యాలు సమకూరుతున్నాయి. ట్రాక్టర్ కొనుగోలుతో చెత్త సేకరణ జరుగుతున్నది. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ట్యాంకర్లతో నీళ్లు అందించే కార్యాచరణ అమలవుతున్నది. వారం రోజుల పల్లె, పట్టణ ప్రగతిలో మె రుగైన ఫలితాలు ప్రజల కండ్ల ముందు కదలాడుతున్నాయి. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పా టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటనలతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనుల్లో పారదర్శకత, కచ్చితత్వం కనిపిస్తున్నది. కాకి లెక్కలకు ఆస్కారం లేకుండా పారదర్శకమైన పనులు జరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఊరూరా బిజీబిజీ…
పైప్లైన్ లీకేజీలు అరికట్టడం, తాగునీటి ట్యాంకు లను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయడం, శిథిల భవనాలను తొలగించడం, తడి-పొడి చెత్తపై మహిళలకు అవగాహన కల్పించడం, విద్యుత్ సమస్యలను పరిష్కరించడం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పర్చడం వంటి పనులు పల్లె ప్రగతిలో వేగంగా చేపడుతున్నారు. నిజామాబాద్, కా మారెడ్డి జిల్లాల్లో ఆరు మున్సిపాలిటీలు, నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రగతి కా ర్యక్రమం సైతం జోరుగా సాగుతున్నది. నిజామాబాద్లో 8566 రోడ్లు, 7556 మురికి కాలువలు, 2850 ప్రజా సంచార ప్రాంతాలు, 647 గుంతలు పూడ్చడం వంటి పనులు పూర్తయ్యాయి. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో వేలాడుతున్న తీగలు, కూలేందు కు సిద్ధంగా ఉన్న స్తంభాలు, ఇతరత్రా పనులను గుర్తించి సరి చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 21, 359 రోడ్లు, 15,695 మురికి కాలువలు శుభ్రం చేశారు. 1915 వేలాడుతున్న తీగలను, 2605 వంగిన స్తంభాలు, 779 కొత్త మీటర్లు అమర్చారు.
ప్రజల భాగస్వామ్యం పెంచుతూ…
గతేడాది చేపట్టిన కార్యక్రమంలో అధికారులు, ప్ర జా ప్రతినిధులు, జనం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈసారి కూడా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ పల్లె, పట్టణ ప్రగతిని విజయవంతం చేసేలా యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిజామాబాద్ జిల్లాలో ‘డొనేషన్ డే’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశారు. ఊరి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ విరాళాలు సేకరించి ఖర్చు చేసే పనికి శ్రీకారం చుట్టడంతో మంచి ఫలితాలు వచ్చాయి. అంతేగాకుండా శ్రమదానం పేరు తో యువత, ప్రజా సంఘాలు, ప్రజలను పాలు పంచుకునేలా చేస్తున్నారు. పల్లె, పట్టణ ప్రగతి పనుల తీరును ఆకస్మిక తనిఖీ చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల బృందాలు జిల్లాలోని ఆయా ప్రాంతాలను తనిఖీ చేయనున్నారు. మరోవైపు జిల్లా స్థాయిలోనూ తనిఖీలు నిర్వహించడానికి ఆయా శాఖల అధికారులను మండలాలకు ప్రత్యేకాధికారులుగా నియమించారు.
మొక్కల పండుగ…
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పథకా న్ని నిర్విరామంగా చేపడుతున్నది. వన సంపద లక్ష్యంగా ఆరు విడుతలు పూర్తి చేసుకుని ఏడో విడతకు సిద్ధమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అడవులను మరింత విస్తరించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అధికార యంత్రాం గం సమాయత్తం అవుతున్నది. ప్రతీ గ్రామ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచా రు. పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో అవెన్యూ ప్లాం టేషన్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 7లక్షల 77వేల 530 మీటర్ల మేర రోడ్లపై మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి జిల్లాలో 4లక్షల 23వేల 802 మీటర్ల పొడవునా 4లక్షల 31వేల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నారు. ఇంటింటికీ పంచాయతీ, పురపాలక సిబ్బంది స్వయంగా ఆరు మొక్కలను ఉచితంగా పంపిణీ చేసి ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేస్తున్నారు.
పది రోజులకు పరిమితం కాకుండా…
గతంలో మూడు సార్లు నిర్వహించిన పల్లె ప్రగతి, రెండు సార్లు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలు అందిస్తున్నాయి. నిరంతరాయంగా చేపట్టాల్సిన ఈ కార్యక్రమాలను స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు కేవలం పది రోజులకే పరిమితం చేస్తున్నారు. ఉదాహరణకు గత ఏడాది చేపట్టిన పనుల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూ ల్చివేశారు. ఈ పనులు కేవలం 10 రోజులకే పరిమితం చేశారు. మిగిలిన రోజుల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లను పట్టించుకోలేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో తిరిగి శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేసేందుకు నాలుగో విడుత పల్లె ప్రగతిలో లక్ష్యం గా పెట్టుకున్నారు. తద్వార విలువైన సమయం వృథా కావడంతో పాటుగా ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యం నిరుపయోగం అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
నిరంతరాయంగా నిర్వహించాల్సిన పారిశుద్ధ్య పనులను ప్రగతి కార్యక్రమాలకే పరిమితం చేస్తున్నారు. మురుగు కాల్వల పూడికతీత నిరంతరాయంగా చేపట్టాల్సిన ప్రక్రియ అయినా కొనసాగించడం లేదు. పురపాలికల్లో చేపట్టిన డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు నిర్మాణాలు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి ఉపయోగంలోకి తేవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.