e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home కామారెడ్డి చెక్‌ చక

చెక్‌ చక

చెక్‌ చక

నిజామాబాద్‌ జిల్లాలో చురుకుగా సాగుతున్న 30 చెక్‌డ్యాముల నిర్మాణం
నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
వానకాలం మొదలవడంతో పనుల్లో పెరిగిన వేగం
మొత్తం రూ.160 కోట్లతో ఆనకట్టల నిర్మాణం
వరద నీటిని ఒడిసిపట్టాలని ప్రభుత్వ నిర్ణయం

నిజామాబాద్‌, జూన్‌ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గోదావరి నది పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో వాగులు, వంకలు అనేకం. ప్రతి మండలంలోనూ వరద నీటిని మోసుకొచ్చే వాగులు చాలా ఉన్నాయి. దశాబ్దాలుగా వరద నీటితో సహజ సిద్ధంగా ఏర్పడిన వాగుల అంతిమ గమ్యం గోదావరి నదే. ఆయా గ్రామాల గుండా, గుట్టలు, అడవుల గుండా ప్రయాణించి చివరకు జీవనదిలో వాగులన్నీ సంగమిస్తుంటాయి. ఏడాదిలో అగ్రభాగం ఎడారిలా కనిపించే అనేక వాగులు… సీజన్‌లో చిన్నపాటి వానలతో జలకళతో దర్శనం ఇస్తుంటాయి. వీటితో స్థానికులతోపాటు రైతులకు ఉపయోగం అంతంత మాత్రమే. వాగులపై ఆనకట్టలు లేకపోవడం, నేలపై కురిసిన వాన చినుకులు నేరుగా వరదై కిందికి పోవడమే తప్పా ఎక్కడా ఉపయోగకరం లేదు. వృథాగా పోతున్న వాన నీటిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కీలక నిర్ణయం తీసుకున్నది. వాగులపై చెక్‌ డ్యామ్‌లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని సూచించింది. నిజామాబాద్‌ జిల్లాలో 30 చెక్‌డ్యామ్‌లు ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
నాలుగు నియోజకవర్గాల్లో 30 చెక్‌డ్యాములు
నిజామాబాద్‌ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అర్బన్‌లో పూలాంగ్‌ వాగు ఉన్నప్పటికీ పట్టణీకరణ ప్రభావం మూలంగా ఆనకట్టల నిర్మాణానికి ఇక్కడ ఆలోచన చేయలేదు. బాల్కొండ, ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో వాగులు అనేకం నెలకొన్నాయి. వాన నీటితో ఏటా ఉప్పొంగే వాగుల్లోని వరద నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా యంత్రాంగం గతేడాది సర్వే నిర్వహించింది. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రజా అవసరాల మేరకు, భూగర్భ జలాలను పెంపొందించడమే లక్ష్యంగా చెక్‌డ్యాములు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. బాల్కొండలో 10, నిజామాబాద్‌ రూరల్‌లో 10, బోధన్‌లో 6, ఆర్మూర్‌ 6 చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. మూడు ఏజెన్సీలు వీటికి సంబంధించిన నిర్మాణ పనులను దక్కించుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు చెక్‌డ్యామ్‌ నిర్మాణాలకు రంగంలోకి దిగారు. 30 ఆనకట్టల నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి.
నెలాఖరు నాటికి..
వానకాలంలో వరద నీటిని వృథా కానివ్వకూడదనే లక్ష్యంతో వాగులపై ఆనకట్టలు నిర్మించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకున్నది. నిజామాబాద్‌ జిల్లాలో దాదాపుగా రూ.160 కోట్లు విలువతో 30 చెక్‌డ్యాములు నిర్మాణాలు చేపడుతున్నది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి కాలేదు. వానలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వానకాలం ప్రారంభం కావడంతో వానలు అక్కడక్కడ దంచి కొట్టాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనకట్టల నిర్మాణాల్లో జాప్యం ఉండకూడదని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద వచ్చే నాటికి ఆనకట్టల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచనలు చేసింది. దీంతో జల వనరుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిర్మాణాలను వేగంగా జరిపించేందుకు చొరవ చూపుతున్నారు. నిర్మాణాల్లో ఆలస్యమైతే మరో ఏడాది వరకు వాగుల్లో నీటి జాడ నిలపడం సాధ్యం కాదు. అందుకే త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
భూగర్భ జలాలు పెంపు…
చెక్‌డ్యామ్‌లతో బహుళ ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా సాగు నీటి వసతి లేని ప్రాంతాల్లో చెక్‌డ్యాములు ద్వారా ఫలితాలుంటాయి. నీరు నిల్వ ఉండడం మూలంగా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అమాంతం పెరుగుతాయి. బోరు బావుల ఆధారంగా సాగు చేసే రైతులకు నీటి కష్టాలుండబోవు. చెక్‌డ్యామ్‌లతో వృథా అయ్యే వరద నీరంతా నిలిపేయడం మూలంగా జలకళ సంతరించుకుంటుంది. మరోవైపు చెక్‌డ్యామ్‌లో నీటి నిల్వతో పశువులు, అడవి జంతువులకు దాహార్తి ఇబ్బందులు సైతం నివారించే వీలు దక్కుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1200 చెక్‌డ్యాములను నిర్మించేందుకు సీఎం కేసీఆర్‌ గతేడాది నిర్ణయం తీసుకున్నారు. వర్షపు నీటితో జల సవ్వడులు కురిపించే వాగులు, వంకల్లో చెక్‌ డ్యాంలు నిర్మించేందుకు ప్రభుత్వం పుష్కలంగా నిధులు మంజూరు చేసింది. 2021 వానకాలంలోపే ఆనకట్టలు నిర్మించి వాన నీటిని ఒడిసి పట్టుకోవాలనేది సీఎం ప్రధాన ఉద్దేశం. జిల్లాలో వరద నీటితో పొంగి పొర్లే వాగులు వంకలను గుర్తించి వాటిపై ఆనకట్టలు నిర్మించడంతో రైతులకు మేలు జరుగనుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చెక్‌ చక

ట్రెండింగ్‌

Advertisement