నిజామాబాద్, జులై 4, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తీసుకున్న చొరవకు అద్భుతమైన స్పందన లభించింది. ఆదివారం నిర్వహించిన డొనేషన్ డే కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో మనసున్న మారాజులు ఎంతో మంది స్పందించారు. తమ ఊరి బాగు కోసం ఇతోధికంగా సాయం చేశారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష విలువ చేసే పనిముట్లు, వాహనాలు, ఇతరత్రా అవసరాలు తీర్చే పరికరాలను విరాళంగా అందించారు. దాతృత్వం చూపించడంలో గ్రామాల్లో ఊహించని స్పందన రాగా పట్టణాల్లో, నిజామాబాద్ నగరంలో మాత్రం ప్రముఖులు ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఊరి బాగు కోసం విరాళంగా ఇచ్చి దాతృత్వం చూపించిన వారంతా మిగిలిన ప్రముఖుల కు ఆదర్శంగా నిలుస్తున్నారు. డొనేషన్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం గ్రామ పం చాయతీల్లో 629 మంది దాతలు ముందుకు వచ్చారు. వీరంతా ఇచ్చిన విరాళాల మొత్తం రూ.73.67 లక్షలు కావడం విశేషం. ఆయా మున్సిపాలిటీల్లో ఏడుగురు దాతలు స్పందించడంతో రూ.7లక్షలు మేర విరాళం అందింది.
ఊరూరా… మహరాజులు…
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జన్మనిచ్చిన పురిటి గడ్డ మేలు కోసం పరితపించిన శ్రీమంతులకు కొదవ లేదని స్పష్టమైంది. ఎవరి స్థాయిలో వారు ప్రభుత్వ ప్రయత్నానికి ఎంతో కొంత అండగా నిలుస్తూ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ముందుకువచ్చారు. తద్వారా గ్రామాల్లో మరిన్ని మెరుగులు అద్దడానికి గ్రా మ పంచాయతీ పాలకవర్గాలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మరింత అవకాశం దొరికినట్లు అయ్యింది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ నిర్వహించిన డొనేషన్ డేకు ఆదివారం ఒక్క రోజే దాదాపుగా గ్రామాల నుంచి 629 మంది దాతలు ముందుకు వచ్చారు. వారి ఆర్థిక స్థోమతను బట్టి విరాళాలు ప్రకటించారు. వైకుంఠ రథం, నీటి ట్యాంకర్లు, విద్యుత్ దీపాలు, కంప్యూటర్లు, కుర్చీలు, బెంచీలు ఇలా ఒకటేమిటి.. గ్రామానికి అవసరమయ్యే ఉపకరణాలను వితరణ చేశారు. నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా 27 మండలాలుండగా ప్రతి మండలం నుంచి పదుల సంఖ్యలో దాతలు ముందుకు రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. దాతలిచ్చిన విరాళాల మొత్తం ఒకే రోజులో రూ.73.67లక్షలకు చేరడం విశేషం.
అత్యధికులు ఇక్కడే…
డొనేషన్ డే సందర్భంగా వచ్చిన మొత్తం విరాళాల్లో అత్యధికంగా బోధన్ రెవెన్యూ డివిజన్ నుంచే ఉన్నా యి. బోధన్ మండలం పరిధిలో ఆయా గ్రామ పంచాయతీల నుంచి భారీగా స్పందన వచ్చింది. రుద్రూర్, వేల్పూర్ మండలాల్లో అత్యధిక మొత్తంలో విరాళాలు వచ్చాయి. రుద్రూర్లో ఆరుగురు దాతలు ముందుకు రాగా వీరిచ్చిన విరాళాల మొత్తం రూ.13.42 లక్షలుగా ఉంది. వేల్పూర్‌లో 12 మంది దాతలు స్పందించారు. వీరిచ్చిన మొత్తం విరాళాలు రూ.10.28లక్షలుగా ఉం ది. కోటగిరిలో 82 మంది దాతృత్వాన్ని ప్రదర్శించి రూ.2.45 లక్షలు అందించారు. రెంజల్లో 76 మంది మనసున్న మారాజులు ముందుకు రావడంతో ఇక్కడ రూ.4.60 లక్షలు సమకూరాయి. నవీపేటలో 62 మం ది స్పందించి రూ.4.16 లక్షలు సమర్పించారు. బోధన్ మండలంలో 48 మంది ఇచ్చిన విరాళాల మొత్తం రూ. 2.99 లక్షలుగా ఉంది.
డిచ్‌పల్లిలో రూ.9.03 లక్షలు, బాల్కొండలో రూ.5 లక్షలు, మోర్తాడ్‌లో రూ. 3.17 లక్షలు, ఏర్గట్లలో రూ.2.40లక్షలు, నందిపేటలో రూ.2.52 లక్షలు, ముప్కాల్‌లో రూ.2.05 లక్షలు, ఇందల్వాయిలో రూ. 2.04 లక్షల మేర విరాళాలు వచ్చినట్లు అధికారులు వివరించారు. మిగిలిన మండలాల్లోనూ విరాళాలు ఆశాజనకంగానే రావడం విశేషం.
దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు…
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా డొనేషన్ డే పిలుపును అందుకుని స్పందించిన దాతలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఊరి అభివృద్ధిలో భాగమై తమ వంతుగా స్పందించి విరాళాలు అందించిన వారికి స్థానిక గ్రామస్తుల్లో మంచి గుర్తింపు ఉంటుంది. చాలా మంది వస్తు రూపంలో గ్రామాలకు సాయం అందించారు. 27 మండలాల నుంచి స్పందన రావడం శుభపరిణామం. ఊరి అవసరాలు తీరేలా కొంత మంది ప్రత్యేక వాహనాలను సమకూర్చారు. ఒకేరోజులో రూ.80లక్షలు మేర జిల్లా వ్యాప్తంగా విరాళాలు రావడం గొప్ప విషయం. జూలై 10వ తారీఖు వరకు డొనేషన్ స్వీకరణ ఉంటుంది. తమ ప్రాంతం అభివృద్ధిని ఆకాంక్షించిన వారంతా స్పందించి ఏదో విధంగా విరాళాలను ప్రకటించవచ్చు. వారి సేవకు బిరుదుతో సత్కరించి వారికి సముచిత గౌరవాన్ని తప్పక అందిస్తాం.