కంటేశ్వర్ : పట్టుదల ఉంటే అడ్డంకులన్నీ దాటి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు చేసే ప్రయత్నం ఫలిస్తుందని నిరూపించారు నిజామాబాద్ ( Nizamabad) జిల్లా కేంద్రానికి చెందిన వి హరిత (Haritha) . సుభాష్‌నగర్ ప్రాంతంలో నివాసముంటే ఆమె విద్యా, ఉద్యోగ అవకాశాల్లో అనేక అవరోధాలను దాటి చివరకు జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించి మహిళా లోకానికి ఆదర్శంగా నిలించింది.
ప్రస్తుతం సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని గవర్నమెంట్ జూనియర్ మహిళా కాలేజీలో జువాలజీ విభాగంలో జూనియర్ లెక్చరర్ ( Junior Lecturer ) గా పని చేస్తున్న ఆమె తన అనుభవాలను నమస్తే తెలంగాణతో పంచుకుంది. 2017 నోటిఫికేషన్ లో అన్ని పరీక్షలకు 1:2 జాబితాలో నిలిచినప్పటికీ ఉద్యోగం సాధించలేకపోయానని, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ లో టీజీటీ పోస్టును 0.3 శాతం తేడాతో కోల్పోయ్యాయని తెలిపారు.
2018 లో టీఆర్ఈఆర్బీ ఇచ్చిన నోటిఫికేషన్‌తో సెప్టెంబర్ 2019 లో సోషల్ వెల్ఫేర్‌లో జేఎల్ ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. 2018 టీఆర్ఈఐఆర్బీలో జేఎల్ పోస్టులో రాష్ట్రస్థాయిలో 6 వ ర్యాంక్ సాధించి జోన్ సిక్స్ లో మహిళా టాపర్‌గా నిలిచింది. డీఎల్ పోస్టుకు ( DL Post) రాష్ట్రస్థాయిలో 14వ ర్యాంకు సాధించినప్పటికీ ఈక్వేలన్స్ ఇష్యూ కింద ఉద్యోగం పొందలేక పోయానని తెలిపారు .
2021లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ( Food Safety Officer) 1:2 జాబితాలో నిలిచానని, కానీ ఉద్యోగం రాలేదని వెల్లడించారు. డిసెంబర్ 2022 లో వచ్చిన జేఎల్ నోటిఫికేషన్ తో 2023 సెప్టెంబర్‌లో పరీక్షకు హాజరై రాష్ట్రస్థాయిలో జీఆర్ఎల్ 36 ర్యాంకు మల్టీజోన్ టూ లో 14వ ర్యాంకు మహిళా క్యాటగిరి లో మూడవ ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
వివాహం జరిగిన చదవడం కుదరదని చాలా మంది మహిళలు చదువును ఆపేస్తారని , ఆ విధంగా కాకుండా చదువు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే విజయం తథ్యమని అన్నారు. తన ఉద్యోగ సాధనలో భర్త రవీందర్ గౌడ్ పాత్ర మరువలేనిదని, సంకల్పానికి తోడు భర్త ప్రోత్సాహం ఉండడం వలన తాను సఫలమయ్యాను అని అన్నారు.
తన భర్త యూపీఎస్సీ సివిల్‌సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేరై విజయం సాధించలేకపోవడంతో తనను ఎంతగానో ప్రోత్సహించడం వల్ల జూనియర్ లెక్చరర్ ఉద్యోగం సాధించానని వెల్లడించారు. ఎప్పుడూ పాజిటీవ్‌గా ఉండే తత్వాన్ని అలవరచుకున్నందుకే ఈ విజయం సాధ్యపడిందని తెలిపారు. నేటి సమాజంలో యువత క్షణికావేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఒక నిమిషం ఆలోచించి తీసుకుని నిర్ణయం తీసుకుంటే జీవితాలను మార్చేస్తుందని అన్నారు.