కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వంలో పెద్దదిక్కు కరువైంది. కీలకమైన మంత్రి పదవి ఈ ప్రాంతానికి ఇవ్వకపోవడంతో సర్కారులో ప్రాధాన్యత కరువైంది. ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సారథ్యంలోనే అన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలకు అమాత్యయోగం ఎప్పుడు వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పరిపాలనను ముందుకు నడిపించేందుకు కీలకమైన మంత్రి ఒకరు కచ్చితంగా ఉండాల్సిందే. రేవంత్ సర్కారు కొలువుదీరి ఆరు నెలలు పూర్తయినప్పటికీ ఇంత వరకూ భర్తీ ప్రక్రియ జరుగలేదు. మంత్రివర్గ విస్తరణపై చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తుండగా ఏఐసీసీ, పీసీసీ నాయకత్వం తాత్సారంతో వాయిదా పడుతూ వస్తున్నది.
ఉత్తర తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కీలకమైన భాగస్వామి. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయపరంగా ఎంతో ప్రాముఖ్యమైంది. ఇంతటి ఘనకీర్తిని కలిగిన ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవ్వరికీ చోటు దక్కకపోవడంపై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఖమ్మం లాంటి జిల్లాకు మూడేసి మంత్రి పదవులు ఇచ్చి ఉమ్మడి జిల్లాకు మొండి చేయి చూపడంలో ఆంతర్యం ఏమిటంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఏనాడూ ఉమ్మడి జిల్లా నిర్లక్ష్యానికి గురి కాలేదు.
ఓ వైపు సుదర్శన్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తున్న దరిమిలా తెరపైకి కొత్తగా మరికొంత మంది పేర్లు కూడా వినిపిస్తుండడం ఆసక్తి నెలకొన్నది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, పీసీసీ ముఖ్య నాయకుడు షబ్బీర్ అలీ పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లుగా జోరుగా చర్చ జరుగుతున్నది. అవసరమైతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరికీ మంత్రి పదవి దక్కే వీలున్నట్లుగా పలువురు కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే ఎవరెవరికి మంత్రి పదవి దక్కుతుందోనన్న ఆసక్తి హస్తం నేతల్లో కనిపిస్తున్నది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో షబ్బీర్ అలీ మినహాయిస్తే అంతా అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. బీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది. చట్టసభల్లో బీసీలకు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాధాన్యమే దక్కలేదు. మహేశ్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో చాలా మంది టికెట్ ఆశించగా భంగపాటుకు గురయ్యారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో బీసీలకు పెద్దపీట దక్కుతుందా? లేదంటే అగ్రవర్ణాలకు చోటు కల్పిస్తారా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
రేవంత్ క్యాబినెట్లో మైనార్టీ లీడర్లకు చోటు లేకుండా పోయింది. షబ్బీర్ అలీ పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆ వర్గానికి స్థానమే కరువైంది. ఈ నేపథ్యంలో మైనార్టీ కోటాలో షబ్బీర్‌కు అమాత్యయోగం వరిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో తాజా రాజకీయాన్ని పరిశీలిస్తే రెడ్డి వర్సెస్ బీసీ వర్సెస్ మైనార్టీ అన్నట్లుగా తయారైంది. సుదర్శన్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీల్లో ఎవరికి అమాత్యయోగం దక్కాల్సి ఉందో కాలమే నిర్ణయించాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటే కామారెడ్డిలో రెండు చోట్ల, నిజామాబాద్‌లో రెండుచోట్ల హస్తం పార్టీ గెలిచింది. ఇందులో సీనియర్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. పీసీసీ ముఖ్య నాయకుడిగా షబ్బీర్ అలీ ఉన్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. అనంతరం ఆయనకు క్యాబినెట్ ర్యాంకుతో సమానమైన ప్రభుత్వ సలహాదారు పదవి దక్కినప్పటికీ మంత్రి పదవికి ఉండే హోదా, దర్పం అందులో కనిపించకపోవడంతో లోటు కనిపిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం కుదురుకున్న సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో క్యాబినెట్ కూర్పు వాయిదా పడింది. మంత్రివర్గ విస్తరణలో మొదట్నుంచి ఉమ్మడి జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికే చోటు దక్కుతుందని చర్చ నడుస్తున్నది. ఉభయ జిల్లాల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురూ కొత్తవారే ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి మొదటిసారి గెలిచారు. వీరితో పోలిస్తే సుదర్శన్ రెడ్డికి సీనియారిటీ కలిసి వస్తుంది. రేవంత్ మంత్రివర్గంలో హోంశాఖను ఎవ్వరికీ కేటాయించకపోగా సీఎం వద్దే ఉన్నది. కీలకమైన పోలీస్ శాఖను సుదర్శన్ రెడ్డికే కేటాయించబోతున్నట్లుగా ఈ ఏడాది ప్రారంభం నుంచే ప్రచారం నడుస్తున్నప్పటికీ ఇంత వరకూ రేవంత్ క్యాబినెట్లో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత లేకుండా పోయింది.