కమ్మర్పల్లి, మార్చి 29: మండలంలోని ఉప్లూర్‌లో పలు అభివృద్ధి పనులకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో జీపీ భవనం, రూ.88 లక్షలతో ఉప్లూర్ నుంచి డబ్బా గ్రామం వరకు జిల్లా సరిహద్దు రోడ్డు, రూ.7.50 లక్షలతో ఉప్లూర్-తిమ్మాపూర్ రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో, సురేశ్‌నగర్ కాలనీలో మహిళలతో మాట్లాడారు. ‘మీరు వచ్చాకే కాలనీలో రోడ్లు, డ్రైనేజీల సౌకర్యం కలిగింది’అని పలువురు మహిళలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని శ్రీ బాల రాజేశ్వర స్వామి ఆలయంలో స్వయం భూలింగాన్ని దర్శించుకున్నారు. జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, కలెక్టర్ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ పెరుమాండ్ల రాధ, సర్పంచ్ బద్దం పద్మా చిన్నారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మలావత్ ప్రకాశ్, ఎంపీటీసీ పిప్పెర అనిల్, ఎంపీడీవో సంతోష్ రెడ్డి, ఎంఈవో ఆంధ్రయ్య, హెచ్ఎం ఎస్.దేవన్న, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి ఇంటి వద్ద సందడి..
వేల్పూర్‌లోని మంత్రి ఇంటి వద్ద నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొన్నది. ఆయా గ్రామాల్లోని సమస్యలపై మంత్రి ప్రజా ప్రతినిధులతో చర్చించారు. పలు కుల సంఘాల బాధ్యులు మంత్రిని కలిసి తమ కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన దరఖాస్తులను మంత్రి స్వీకరించారు.