ఇందల్వాయి, నవంబర్ 29: ఒక్కో విద్యార్థి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్షా 20వేలు ఖర్చు చేస్తున్నదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండలకేంద్రంలోని కేజీబీవీని ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌తో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లిదండ్రులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల పనులను త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
ఆరోగ్య కేంద్రం పరిశీలన..
మండలకేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ తనిఖీ చేశారు. మెడికల్ ల్యాబ్‌లో కొత్తగా వచ్చిన బ్లడ్ టెస్ట్ యంత్రాన్ని ప్రారంభించి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు. అనంతరం డయాబెటిక్ రోగులకు మందుల కిట్లను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ రమేశ్‌నాయక్, వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు చిలువేరి గంగదాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోహన్ నాయక్, సొసైటీ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లోలం సత్యనారాయణ, ఎంపీటీసీలు చింతలదాస్, మారంపల్లి సుధాకర్, నాయకులు పాశం కుమార్, రఘు, మొచ్చ గోపాల్, శెట్టి బీరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ చైర్మన్‌ను కలిసిన నాయకులు
మండలంలోని సిర్నాపల్లి సర్పంచ్ తేలు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో వీడీసీ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డిని జిల్లాకేంద్రంలో కలిశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనులను వివరించారు. బాజిరెడ్డిని కలిసిన వారిలో ఎంపీటీసీ కచ్చకాయల అశ్వినీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ నవీన్‌గౌడ్, వీడీసీ సభ్యులు, నాయకులు ఉన్నారు.
సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు..
మోపాల్ మండలంలోని బోర్గాం(పీ) గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సప్తమ వార్షికోత్సవం నిర్వహించారు. వేడుకల్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కోసం నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారం (బీ) గ్రామానికి చెందిన మాలధారుడు సురేశ్ నిర్వహించిన పడిపూజకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్సీ వీజీగౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని సురేశ్ ఘనంగా సత్కరించారు.