అత్యాధునిక వాహనాలు.. ఆకట్టుకునే మోడళ్లు.. టెస్ట్ డ్రైవ్‌లు.. సందర్శకుల తాకిడితో నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానం సందడిగా మారింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఆటో షో’ శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనను కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటరమణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రఫుల్ల కుమార్ జెనా, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్ రావు ప్రారంభించారు. ఆటో షోలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని వివిధ వాహనాలను పరిశీలించారు. సందర్శకులకు ఉచిత ప్రవేశంతో పాటు లక్కీ విజిటర్స్‌కు బహుమతులను అందజేశారు.
నిజామాబాద్, నవంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహిస్తున్న ఆటో షో కార్యక్రమానికి వాహనప్రియుల నుంచి అపురూప స్పందన లభిస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వరుసగా రెండో ఏడాది నిర్వహించిన ఈ కార్యక్రమానికి నగరవాసులు భారీగా తరలివచ్చి తమ ఆకాంక్షలకు తగిన వాహనాల వివరాలను వాకబు చేశారు.
పాత కలెక్టరేట్ మైదానంలో శనివారం ప్రారంభ వేడుకను నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వెంకటరమణ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రపుల్లా కుమార్ జెనా, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ సురేందర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమా రు గంటపాటు స్టాళ్లను పరిశీలించిన అతిథులు అధునాతన వాహనాల ఫీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాహనాలు, బ్యాటరీ వెహికిల్స్ వివరాలపై లోతుగా ఆరా తీశారు. కలెక్టర్, సీపీలు సరదాగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై సవారీ చేయడం అందరినీ ఆకట్టుకున్నది. బ్యాంకర్లు సైతం అందుబాటులో ఉండడంతో రుణాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఒకే చోటకు భిన్న వాహనాలు..
మహవీర్ స్కోడా, కియా ప్రీమియం వాహనాలు విశేషంగా ఆకట్టుకోగా ఇసుజు కమర్షియల్ సెగ్మెంట్ వాహనం వాణిజ్య వర్గాలను ఆకట్టుకున్నది. లక్ష్మీ నిస్సాన్, టాటా మోటార్స్, మారుతి సుజుకి – వరుణ్ మోటార్స్, నెక్సా నుంచి హైబ్రిడ్ వాహనాలకు చెందిన కార్లకు ఎక్కువగా చర్చలు జరిగాయి. మహిళలకు సౌలభ్యంగా ఉండే అప్రిల్లా వెస్పా వాహనాలను ఆర్.ఆర్.ఆర్. మోటార్స్ ప్రదర్శించింది. అంతర్జాతీయంగా పేరొందిన వోక్స్ వాగన్, మోరీస్ గారేజెస్(ఎంజీ), పూర్తిస్థాయి విదేశీ ఉత్పత్తి బీవైడీ ఎలక్ట్రిక్ కార్లు సైతం ఆటో షోలో ఆకట్టుకున్నాయి. యమహా కంపెనీ ప్రీమియం బైక్‌లు, శ్రీరాం హోండా నుంచి ద్విచక్రవాహనాలు, బిగాస్ ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ ఏర్పడింది. ట్రయల్ రన్లకు చాలా మంది ఆసక్తి చూపారు.
రాయల్ ఎన్ఫీల్డ్ క్రేజీ వాహనాలు, వెంకటేశ్వర హీరో స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. వాహన కొనుగోళ్లకు రుణ సదుపాయం కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాళ్లు సైతం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, కిరణ్, ప్రభాకర్‌తోపాటు నమస్తే తెలంగాణ యూనిట్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ప్రకటనల విభాగం మేనేజర్ శ్రీకాంత్, సర్క్యులేషన్ ఏసీఎం సునీల్ పాల్గొన్నారు.
వాహనప్రియులకు చక్కని వేదిక..
కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఏర్పాటు చేసిన ఆటో షో చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. నిజామాబాద్ వంటి నగరాల్లో ఇంత భారీ ఏర్పాట్లతో వాహన ప్రదర్శన ఏర్పాటు చేయడం చాలా బాగుంది. ఒకే సమయం లో రుణాలు అందించే బ్యాంకులు, రకరకాల వాహనాలు కండ్లముందే ఉండ డం..కొనుగోలుదారులకు ఎంతో ఉపయు క్తం అవుతుంది. కాలుష్యరహిత వాహనాలకు క్రేజీ పెరుగుతున్న సమయంలో అలాంటి స్టాళ్లు కూడా ఏర్పాటు చేయడం మంచి పరిణామం.
– సి.నారాయణ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్
కాన్సెప్ట్ చాలా బాగుంది..
నిజామాబాద్ వంటి నగరాల్లో ఆటో షో వంటి కాన్సెప్ట్‌తో కార్యక్రమాలు చేపట్టడం చాలా బాగుంది. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నిజామాబాద్‌కే హైదరాబాద్ నుంచి బడా ఆటోమొబైల్ కంపెనీలు వచ్చి తమ ఉత్పత్తులు ప్రదర్శించడం ద్వారా ప్రజలకు దూరభారం, రవాణా ఖర్చు తప్పు తాయి. వాహనాలు కొనడం ఎంత ముఖ్యమో ట్రాఫిక్ రూల్స్ పాటించడం, వాహనాలను జాగ్రత్తగా నడపడం అంతే ముఖ్యమైంది.
– కేఆర్ నాగరాజు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్
ఒకే గొడుగు కిందకు అనేక సౌకర్యాలు…
సగటు వాహనదారుడు తన ఆలోచనలకు తగినట్లుగా వాహనాన్ని కొనుగోలు చేయాలంటే రోజులు పడుతుంది. స్థానికంగా ఉండే ఉత్పత్తి సంస్థలు, వనరులు స్వల్పం. అందుకే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పేరొందిన ఆటోమొబైల్ కంపెనీలను ఒక చోటికి చేర్చి ఆటో షోను నిర్వహిస్తున్నాం. 2021లో ఇదే మైదానంలో నిజామాబాద్‌లో తొలి ఎడిషన్ కార్యక్రమం దిగ్విజయమైంది. అదే స్ఫూర్తితో రెండో ఎడిషన్ కార్యక్రమాన్ని తలపెట్టాము. 22 స్టాళ్లు ఏర్పాటు కావడం శుభ పరిణామం.
– ఎన్.సురేందర్ రావు, ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్, నమస్తే తెలంగాణ