‘పల్లెప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
ప్రకృతి వనాలు, రైతు వేదిక, వైకుంఠధామంతో సరికొత్త శోభ
ఆ పల్లెలో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. పల్లెప్రకృతి వనంతో ఆహ్లాదం పంచుతున్నది. గ్రామంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుండడంతో అంటువ్యాధులు, విషజ్వరాల జాడలేదు. వైకుంఠధామం నిర్మాణంతో ఆఖరి మజిలీ కష్టాలు తొలగాయి. మొత్తంగా పల్లెప్రగతితో కోటగిరి మండలం హంగర్గాఫారం పంచాయతీ రూపురేఖలు మారాయి.
-కోటగిరి, నవంబర్ 13
బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం ‘హంగర్గాఫారం’ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లెప్రగతి కార్యక్రమం ఆ ఊరి రూపురేఖలను మార్చివేసింది. వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, నర్స రీ, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయ్యాయి. గ్రామంలోకి ప్రవేశించగానే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా కనిపించే హరితహారం చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ శుద్ధమైన నీరు అందుతున్న ది. ప్రభుత్వ సహకారం, గ్రామస్తుల ఐక్యతతోపాటు పాలకవర్గసభ్యుల కృషితో గ్రా మం అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్నది.
రూ. 10.50 లక్షలతో వైకుంఠధామం..
గ్రామానికో వైకుంఠధామం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హంగర్గాఫారం గ్రామానికి అందివచ్చిన అవకాశంగా మారింది. గతంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే దహనసంస్కారాలకు సరైన స్థలం లేక గోసపడేవారు. వైకుంఠధామం ఏర్పాటుతో గ్రామస్తుల అవస్థలు తీరాయి.
ఆహ్లాదకరంగా పల్లెప్రకృతి వనాలు..
హంగర్గాఫారం గ్రామంలో ఏర్పాటు చేసిన రెండు పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా మారాయి. పలు రకాల పూలు, అందాన్నిచ్చే మొక్కలను నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ప్రతి రోజూ చెత్తను తొలగిస్తున్నారు. రోడ్లు, మురికి కాలువ లు శుభ్రంగా ఉండడంతో సీజనల్ వ్యాధు ల జాడనే లేదు.
నాటిన ప్రతి మొక్కనూ బతికిస్తున్నాం..
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షిస్తున్నాం. నిత్యం నీళ్లు పోస్తూ, మొక్కల చుట్టూ పెరిగే పిచ్చి మొక్కలను తొలగిస్తున్నాం. నర్సరీలో 30 రకాల మొక్కలను పెంచుతున్నాం. పండ్లు, పూల మొక్కలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేస్తున్నాం. హరితహారంలో నాటిన ప్రతి మొక్క బతికేలా చూస్తున్నాం.
– నిర్మల, పంచాయతీ కార్యదర్శి
పల్లెప్రగతితో దశ మారింది..
పల్లె ప్రగతి కార్యక్రమంతో మా ఊరు మొత్తం మారిపోయింది. గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు చక్కని అవకాశం దక్కింది. శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మంజూరు చేసిన నిధులు, సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోగలిగాం.
-ఎజాజ్ఖాన్, సర్పంచ్