బాల్కొండ, నవంబర్ 12: మండల కేంద్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రోజువారీ సంత (తైబజార్) వేలం ఖరారు కాకపోవడతో గ్రామ పంచాయతీ ఆదాయానికి గండిపడుతోంది. మూడుసార్లు వేలం నిర్వహించినా ప్రభుత్వం నిర్ణయించిన ధర పలకకపోవడంతో అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు. బాల్కొండ గ్రామపంచాయతీలో దాదాపు 16 వేల జనాభా ఉంది. ఏటా ఏప్రిల్ నుంచి మార్చి వరకు కాలపరిమితితో తైబజార్ వేలం నిర్వహిస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రోజువారీ సంత నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.1.54 లక్షల కోడ్ నిర్ధారించింది.
కాంట్రాక్టర్లు సిండికేట్గా మారి రూ.1.24 లక్షల కన్నా ఎక్కువ పాడడం లేదు. మూడుసార్లు టెండర్లు వేసినా వాయిదా పడింది. గత టెండర్ ముగిసి 8 నెలలు గడుస్తున్నా తైబజార్కు సంబంధించిన ఆదాయం గ్రామ పంచాయతీకి రావడం లేదు. గత సంవత్సరం 2021-22లో రూ.1.45 లక్షలు పలికింది. ఈ సంవత్సరం ప్రభుత్వం 5 శాతం మాత్రమే పెంచినప్పటికీ కాంట్రాక్టర్లు సిండికేట్గా మారడంతో టెండర్లను వాయిదా వేశారు. దీంతో జీపీ ఆదాయానికి గండిపడినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటివరకు సర్వసభ్య సమావేశాల్లోనూ ఈ విషయంపై పాలకవర్గ సభ్యులు చర్చించలేదు.
గత సంవత్సరం టెండర్ దక్కించుకున్న వారు ఇప్పటివరకు గతేడాదికి సంబంధించిన బకాయిలు పూర్తిగా చెల్లించలేదు. గతేడాది రూ.1.45 లక్షలకు టెండర్ దక్కించుకున్న నిర్వాహకులు రూ.20 వేలు మాత్రమే చెల్లించినట్లు గ్రామపంచాయతీ అధికారులు చెబుతున్నారు. టెండర్ల ప్రక్రియలో అధికారులు ముందస్తుగానే సంబంధిత మొత్తానికి చెక్కులు తీసుకోవాలి. టెండర్ కాలపరిమితికి మూడు నెలల ముందుగానే నగదు మొత్తం చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా గ్రామపంచాయతీ ఈవో టెండర్ నిర్వాహకుల నుంచి ఎలాంటి చెక్కు తీసుకోలేదు. గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతోనే జీపీకి రావాల్సిన ఆదాయం రాకుండా పోయింది. ఉన్నతాధికారులు స్పందించి జీపీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వేలం పాటకు ఎవరూ ముందుకు రావడంలేదు. మినిమమ్ అప్సెట్ ప్రైస్ కూడా రాలేదు. ఎవరికైనా ఆసక్తి ఉండి వస్తే ఇచ్చేస్తాం.
– వెంకటేశ్వర్లు. ఎంపీవో