కోర్కెలు తీర్చే స్వామి మణికంఠుడు.. అయ్యప్ప అని భక్తితో తలిస్తే సమస్యల గండాలను దాటిస్తాడని భక్తుల నమ్మకం. 41 రోజుల పాటు అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దాని వల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుందని గురుస్వాములు చెబుతారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో అయ్యప్ప మాలధారుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. కార్తిక మాసంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంటున్నది.
అంతులేని ఆత్మవిశ్వాసం, అంతకుమించి సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యం. ఈ దీక్ష అద్వితీయమైన నియమాలతో రూపొందించింది. అయ్యప్ప దీక్షను పాటించే సమయమిదే. 41 రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ, నిష్టగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులివి. తనువు, మనస్సును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే ఈ దీక్షను స్వీకరించిన భక్తులు స్వామియే శరణం అంటూ అయ్యప్ప సేవలో తరిస్తుంటారు. ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దీక్ష వల్ల వచ్చే మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం దీక్షాపరులకు అనుభవంలోకి వస్తాయి. శివునికి ప్రీతిపాత్రమైన కార్తికమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య నియమాల కలబోత అయిన అయ్యప్ప దీక్ష విశేషాలపై ప్రత్యేక కథనం…
– ఎల్లారెడ్డి రూరల్, అక్టోబర్ 29
అయ్యప్ప సన్నిధానంలో 18 మెట్లు ఉంటాయి. ఇవి కామం, క్రోధం, లోభ, మోహ, మద, మత్సర్యాలైయిన అరిషడ్వర్గాలని ప్రతీతి. మనిషిలోని 18 రకాల చెడు గుణాలు తొలగిపోవడానికి దీక్షలో పడిపూజ (మెట్టు పూజ) నిర్వహిస్తారు. అయ్యప్ప మాల ధరించిన ప్రతిసారి చెడు లక్షణాలను విడిచిపెట్టి మంచి వారిగా మారాలని కోరుకుంటూ ఈ పూజను నిర్వహిస్తారని గురుస్వాములు చెబుతారు.
శబరి కొండల్లో ఉండే మాలికాపురోత్తమ అయ్యప్పస్వామిని ప్రేమిస్తుంది. తనను వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతుంది. ఇది విన్న స్వామివారు చిరునవ్వుతో తిరస్కరిస్తాడు. అయినా ఆమె పట్టువీడదు. దీంతో కన్నెస్వాములు తన మాల ధరించి రానప్పుడు వివాహమాడుతానని స్వామి ఆమెకు మాట ఇచ్చాడు. నూతన మాలధారులైన కన్నెస్వాములు రాకుండా ఉండడం ఎప్పటికీ జరగదని దీనిలో పరమార్థం. ఇందులో భాగంగానే ఏటేటా కన్నెస్వాముల సంఖ్య పెరుగుతూనే వస్తుంది. తొలిసారి మాలవేసే కన్నెసాములతోపాటు వరుసగా కత్తిస్వామి, గంట స్వామి, గధస్వామి, గురుస్వాములుగా పిలుస్తారు. 9నుంచి 18సార్లు శబరిమల యాత్రకు వెళ్లి వచ్చినవారు కన్నెస్వాములు దీక్షలు చేపట్టేందుకు సహకరిస్తారు.
అయ్యప్ప మాలను కొత్తగా ఈ సంవత్సరమే ధరించినవారు ఉంటారు. ఏండ్ల తరబడిగా దీక్ష స్వీకరిస్తున్నవారూ ఉంటారు. అయితే ఎవరిని ఎలా పిలుస్తారో చాలా మందికి తెలియదు. మొదటి సారి మాలధరిస్తే ‘కన్నె స్వామి’ అంటారు. రెండోసారి ధరించిన భక్తులను ‘కత్తి స్వామి’గా పిలుస్తారు. మూడోసారి అయితే ‘గంట స్వామి’, నాలుగోసారి ‘గధ స్వామి’, ఐదోసారి ‘పేరు స్వామి’, ఆరోసారి ధరించినవారిని ‘త్రిశూల్ స్వామి’ అని వ్యవహరిస్తారు. ఏడు, అంతకన్నా ఎక్కువసార్లు ధరిస్తే ‘గురు స్వామి’గా పరిగణిస్తారు. 18, అంతకన్నా ఎక్కువ సార్లు మాల ధరించినవారిని ‘నారీకేళ స్వామి’ అని సంబోధిస్తారు.
అయ్యప్పస్వామిని నవ విధ సేవలతో పూజిస్తుంటారు. నవ విధాలుగా అనగా శ్రావణం, కీర్తనం, స్మరణం, పాదాసేవనం, అర్చనం, నమస్కారం, ధాన్యం, స్కృతం, ఆత్మ నివేదనంతో 41రోజులు దీక్ష పూర్తి చేసిన తర్వాత ఇరుముడికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఇరుముడి అంటే రెండు అని అర్థం. అనగా రెండు ముడులు అని. ముందు ముడి (మూట)లో పీఠం, భస్మం, గంధం, కొబ్బరికాయలు, నెయ్యి, పూజా సామగ్రి ఉంటాయి. వెనుకముడి (రెండో మూట)లో ప్రయాణానికి కావాల్సిన వస్తువులుంటాయి. వీటినే పుణ్యపు మూట, పాపపు మూట అని పిలుస్తారు.
పూర్వకాలంలో మహీషి అనే రాక్షసి బోళా శంకరుడి వరం పొంది ప్రజలను ఇంద్రాది దేవతలను సైతం హింసించేది. తనకు ఆడ,మగ కలయికతో పుట్టిన వారితో గానీ, విల్లుతో గానీ, ఆయుధాలతో గానీ మరణం ఉండకుండా వరం పొందింది. ఆ తర్వాత ఇంద్రాది లోకాలకు వెళ్లి వికృత చేష్టలకు దిగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. మహీషి చేష్టలకు భయాందోళన చెందిన దేవతలు మహా విష్ణువును శరణు కోరతారు. దీంతో ఆయన మోహినీ అవతారమెత్తి పరమ శివుడిని మోహిస్తాడు. వీరద్దరి కలయికతో అయ్యప్ప జన్మిస్తాడు. మణిమాలతో కేరళ రాజ్యంలోని అటవీ ప్రాంతంలో పాండ్యరాజులకు దొరుకుతాడు. మణిమాలతో దొరికిన ఆ శిశువుకు మణికంఠుడు అని నామకరణం చేస్తారు. మణికంఠుడు మహీషిని వధించి దేవతలు, మునుల పూజలందుకుంటాడు. అనేక మహిమలతో పాండ్య రాజులకు, ప్రజలకు దగ్గరవుతాడు.
అయ్యప్పదీక్ష ఎంతో కఠినమైంది. ప్రస్తుత కాలంలో మనిషి సక్రమమార్గంలో పయనించాలంటే అయ్యప్పమాల ధారణ చాలా అవసరం. మండల రోజుల దీక్ష మనిషిని చెడు నడక, ఆలోచనలు, ప్రవర్తనల నుంచి దూరం చేసి సత్ప్రవర్తనకు దగ్గరజేస్తుంది. 31ఏండ్లుగా అయ్యప్పమాల వేసి శబరిమల వెళ్తున్నాను. ప్రతీ సంవత్సరం మాలధారణ చేసే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది.
– ముదిగొండ చంద్రం గురుస్వామి, ఎల్లారెడ్డి
ఏటా నవంబర్ నెల రాగానే మంచి రోజు చూసుకొని అయ్యప్ప మాలధారణ చేస్తా. 27ఏండ్ల దీక్ష ముగిసింది. మాల ధరించిన నాటి నుంచి 41 రోజులు భగవాన్ సేవలో ఆనందంగా గడుపుతాను. అయప్పస్వామిని పూజించడంతో వ్యక్తిత్వ వికాసం, మానసిక ఉల్లాసం కలుగుతుంది.
-పెద్ది హనుమంతప్ప గురుస్వామి, ఎల్లారెడ్డి