రుద్రూర్,అక్టోబర్ 29: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేసి రైతు నష్టపోవద్దని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన రుద్రూర్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నష్టం కలిగించేలా దళారులు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దళారులందరూ ఒక్కటై తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతుకు నష్టం కలిగిస్తున్నట్లు, ఇతర రాష్ర్టాల నుంచి లారీలను కూడా అడ్డుకుంటున్నట్లు తనకు తెలిసిందన్నారు.
కలెక్టర్‌తో మాట్లాడి అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తొందరపడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఏసీపీ కిరణ్‌కుమార్, ఎంపీపీ అక్కపల్లి సుజాతానాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.