బాన్సువాడ టౌన్/రుద్రూర్, అక్టోబర్ 29: బాన్సువాడ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇండ్ల ను మంజూరు చేయడం తన బాధ్యత అని, నిర్మించుకోవడానికి లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సొంతిల్లు నిర్మించుకోవడం అనేది ఒక యజ్ఞం లాంటిదన్నారు. శనివారం ఆయ న బాన్సువాడ, రుద్రూర్ మం డల కేంద్రాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు అప్పగించి, సరైన సమయంలో, నాణ్యతా ప్రమాణాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనే బదులు సొం తంగా నిర్మించుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు. తాను మంజూరు చేసిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అధికశాతం మహిళల పేరుమీదనే ఇస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే వారు చేతబట్టిన ఇల్లు సుఖసంతోషాలతో, ధన, ధాన్యాలతో కళకళలాడుతుందన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల బడ్జెట్లో అధిక శాతం బాన్సువాడ నియోజకవర్గానికే కేటాయిస్తున్నారని, తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. బిల్లులు అందుకున్నవారు ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు బాన్సువాడ నియోజక వర్గంలో రూ.120 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మొదటి విడుతగా రూ.50 కోట్లు, రెండో విడుతగా రూ.20కోట్లు మంజూరుచేసినట్లు చెప్పారు. ఐదుమండలాలకు కలిపి సుమారు రూ.16కోట్ల బిల్లులను శనివారం పంపిణీ చేసినట్లు వివరించారు. రుద్రూర్లో షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్పీకర్ అందజేశారు.
వృద్ధురాలికి సన్మానం
నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తన సొంత స్థలంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును సభాపతి వృద్ధురాలికి అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గురు వినయ్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.