మెండోరా, అక్టోబర్ 29 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు వరదగేట్లను శనివారం కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో ఎస్సారెస్పీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో మూసివేశారు. ఈ సందర్భంగా ఈఈ చక్రపాణి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం జూలై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు వర్షాకాలం మొత్తం గేట్లను తెరిచి ఉంచి దిగువకు బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీటిని వదిలిపెట్టాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గేట్లను తెరిచామన్నారు. అక్టోబర్ 29న గేట్లను అధికారుల సమక్షంలో మూసివేసినట్లు చెప్పారు.
బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 2.75 టీఎంసీలు కాగా గేట్ల మూసివేత అనంతరం పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శనివారం సాయంత్రానికి నిండుకుండలా ఉందని ఈఈ తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను వచ్చే ఏడాది మార్చి ఒకటిన అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటి విడుదల చేపడుతామన్నారు.
కార్యక్రమంలో సీడబ్లూసీ సీఈ శ్రీనివాస్, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, డీఈఈలు రఘుపతి, రవీంద్ర, ఏఈఈలు రవి, వంశీ తదితరులున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి 8,280 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఈఈ తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి నాలుగు వేలు, కాకతీయ కాలువకు నాలుగు వేలు, లక్ష్మీ కాలువకు 150, సరస్వతీ కాలువకు 100 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందన్నారు.