నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ప్రధానంగా రైల్వే కమాన్ పరిసరాల్లో ‘జామ్’జాటానికి తెర పడనుంది. రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం పూర్తి కావడంతో రాకపోకలు సజావుగా సాగనున్నాయి. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ వంతెనను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న నిజామాబాద్ నగరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రూ.వందల కోట్ల నిధులతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల విస్తరణతో పాటు నగర సుందరీకరణ పనులను చేపట్టింది. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రైల్వే కమాన్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపలేదు. మొక్కుబడిగా రూ.2 కోట్లు మంజూరు చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు వెచ్చించి వంతెనను పూర్తి చేసింది. దీంతో నగర వాసుల ట్రాఫిక్ వెతలు తీరనున్నాయి.
నిజామాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. దశాబ్ద కాలం క్రితమే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా రూపాంతరమైన నగరం ఇప్పుడు మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2014కు ముందు నిజామాబాద్ జిల్లా కేంద్రం అంద విహీనంగా దర్శనం ఇచ్చేది. సమైక్య పాలకుల నిర్లక్ష్యం, గతంలో ఏలిన ఈ ప్రాంత ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం, ముందు చూపు లేమితో అభివృద్ధి జాడ అన్నదే మచ్చుకూ కనిపించలేదు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర విస్తరణకు తగినట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జోరుగా జరుగుతోంది. అందులో రోడ్ల వెడల్పుతో పాటు సుందరీకరణ పనులు కూడా ఉన్నాయి. అంతర్భాగ మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడంతో పాటు వాడవాడలో పార్కులు, మైదానాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. తాజాగా దశాబ్దాల నుంచి నగర వాసులను వెక్కిరిస్తోన్న రైల్వే కమాన్ విస్తరణ సైతం తెలంగాణ సర్కారే నిర్మాణం చేపట్టగా త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
నగరంలో రైల్వే కమాన్ అంటే తెలియని వారుండరు. ఆర్మూర్ మీదుగా నిర్మల్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఏకైక మార్గం ఇదే. కేవలం సింగిల్ లైన్‌కు మాత్రమే పరిమితమైన రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద దశాబ్దాలుగా ఒకటే తోవ ఉండేది. గడిచిన కొద్ది కాలంగా నగరంలో పెరిగిన రద్దీకి ఈ రహదారి ఎటూ సరిపోవడం లేదు. పైగా ఎప్పుడో నిర్మించిన రోడ్డుతో వర్షాకాలంలో నీళ్లు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. మరోవైపు భారీ వాహనాల రాకపోకలకు తీవ్రమైన ఆటంకాలే ఎదురయ్యేది. ఏదైనా విపత్కర పరిస్థితిలో నగరం చుట్టూ తిరిగి రావడమే తప్ప రైల్వే కమాన్‌కు ప్రత్యామ్నాయ మార్గం అన్నది నగరవాసులకు లేదు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఈ విషయంపై దృష్టి సారించి నగర వాసుల తిప్పలను దూరం చేశారు. ఇందుకోసం రూ.20కోట్లను తెలంగాణ ప్రభుత్వంతో మంజూరు చేయించి రైల్వే కమాన్ వద్దే రైల్వే అండర్ బ్రిడ్జిని సమాంతరంగా నిర్మాణం పూర్తి చేయించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయగా కేంద్ర ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా రూ.2కోట్లు మాత్రమే అందించింది. అగ్రభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో శాశ్వతంగా నగరం మధ్యలో రాకపోకల చిక్కుకు పరిష్కారం ఏర్పడినట్లు అయ్యింది.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే నిజామాబాద్ నగర పర్యటనకు రాబోతున్నట్లుగా తెలిసింది. ఇందులో భాగంగానే తుది దశకు చేరిన రైల్వే అండర్ బ్రిడ్జి పనులను ప్రారంభించే అవకాశాలున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అండర్ బ్రిడ్జిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అప్రోచ్ రోడ్డు పనులను సీఎస్ఐ కాలేజీ వరకు చేపడుతున్నారు. విజయ్ సినిమా టాకీస్ వరకు పూర్తయిన రోడ్డును ఇప్పటికే రాకపోకలకు అనువుగా మార్చారు. మిగిలి పోయిన పనులను చేపడుతుండడంతో త్వరలోనే తుది మెరుగులు దిద్దుకుని రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి స్థాయిలో నగర వాసులకు అందుబాటులోకి రాబోతున్నది. దీంతో ప్రజల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఈ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయించారు. నగర పర్యటన చేసినప్పుడల్లా ఇంజినీర్లతో కలిసి అనేక సార్లు పనులను తనిఖీలు చేపట్టి సలహాలు, సూచనలు అందించారు. అంతే కాకుండా రైల్వే కమాన్ వద్ద ప్రధానంగా వర్షాకాలంలో వరద నీటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నందున నీళ్లు నిల్వకుండా పకడ్బందీగా మురికి కాలువలను నిర్మించారు. చుక్కా నీరు నిల్వకుండా వరద నీరు బయటికి వెళ్లే విధంగా పనులను చేపట్టారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైల్వే సంబంధిత పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోన్న తీరు ప్రజలకు తెలిసిందే. రైల్వే కమాన్ వద్ద అండర్ బ్రిడ్జి విషయంలోనూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వమే ప్రధాన వాటాదారుగా మారి నిధులను వెచ్చించి నిర్మాణాన్ని భుజానికి ఎత్తుకుంది. కొద్ది మొత్తంలోనే కేంద్ర సర్కారు వ్యయాన్ని భరించింది. మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. రైల్వే కమాన్ అండర్ బ్రిడ్జి నిర్మాణానికి అడుగడుగునా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మోకాలడ్డు పెట్టింది. పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని లేఖలను సంధించి అనుమతులు పొందింది. పైన రైల్వే మార్గానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను చేపట్టడం ఇందులో గొప్ప విషయం. రైళ్ల రాకపోకలు సాగుతున్న క్రమంలోనే కింద పనులను నిర్వర్తించడానికి సరికొత్త టెక్నాలజీని, యంత్రాలను వాడారు. రైల్వే పట్టాలను కదల్చకుండానే పనులు పూర్తి చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఎన్నో ఏండ్లుగా నిజామాబాద్ నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇందుకోసం ఇంజినీర్లతో పలు దఫాలుగా చర్చలు జరిపి ప్రణాళికను రూపొందించి అమలు చేయడం జరిగింది. పైన రైల్వే ట్రాక్‌కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, రైళ్ల రాకపోకలకు అంతరాయ ఏర్పడకుండా పనులు పూర్తి చేయడం అన్నది ఇందులో గొప్పతనం. రోడ్డు వెడల్పుతో పాటు రాకపోకలకు వేర్వేరుగా మార్గాలను సూచించడంతో రైల్వే కమాన్ వద్ద ఇబ్బందులు తొలిగాయి.
– బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే