ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయాలనుకున్న ప్రయత్నాలపై గులాబీ సైన్యం గర్జించింది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రభుత్వాన్ని కూలదోయాలనుకున్న ఢిల్లీ కుట్రలను ముక్తకంఠంతో ఖండించింది. తెలంగాణలో కొనసాగుతున్న సుస్థిర పాలనను ప్రలోభాలతో అస్థిరపరచాలనుకున్న బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలో గురువారం నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజాస్వామిక వాదులు ఢిల్లీ కుట్రలపై ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీజేపీ అవలంభిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊరూరా మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి, కూడళ్ల వద్ద దహనం చేశారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కమలం నేతలు నీచ రాజకీయం చేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన బీజేపీపై ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలుచోట్ల శవయాత్రలు నిర్వహించారు. మోదీ, బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కుట్రలను ఎండగట్టేందుకు రైతులు, మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు. మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ ఇలాంటి నీచమైన చర్యలకు ఒడిగట్టిందని మండిపడ్డారు. నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రశంసల వర్షం కురిపించారు.
రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా బీజేపీ నీతిమాలిన చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వ్యవహరిస్తున్నది. బీజేపీ ఇంత దిగజారుతుందని అనుకోలేదు. ప్రజా అభిమానంతో గెలిచిన ఎమ్మెల్యేలను కొనాలనుకోవడం సిగ్గుచేటు. పనికి మాలిన చర్యలను బీజేపీ మానుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలోనే కాదు.. జాతీయ స్థాయిలో కూడా ప్రజలు తగినబుద్ధి చెబుతారు.
– పీసు రాజ్‌పాల్‌రెడ్డి,
ఎమ్మెల్యేలను కొనాలనుకోవడం సిగ్గుచేటు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ దిగజారడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బీజేపీ అవినీతి పనులను మానుకోవాలి. లేదంటే తగిన బుద్ధి చెబుతాం.
– కె.నవీన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ, ధర్పల్లి
ప్రజల అభిమానంతో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రభుత్వాలను కూలదోసి అడ్డదారిన గద్దెనెక్కాలనుకునే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. అమ్ముడు పోవడానికి, ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇది మహారాష్ట్ర కాదు. కేసీఆర్‌పై నమ్మకం, విశ్వాసం ఉన్న ఎమ్మెల్యేలు కాబట్టే వారు అమ్ముడుపోలేరు. బీజేపీ ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీతిమాలిన చర్యలను మానుకోవాలి.
– మహిపాల్ యాదవ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) ధర్పల్లి మండల అధ్యక్షుడు
తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్ ఉద్యమకారుడి సారథ్యంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉద్యమ బిడ్డలు కాబట్టే ఏ ప్రలోభాలకు లొంగరు. ఇతర రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను కొంటూ ప్రభుత్వాలను కూలదోస్తూ బీజేపీ రాజ్యమేలుతున్నది. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏ ఆఫర్లకు లొంగరు. దేశం కోసం ధర్మం కోసం అంటూ నీతి సూత్రాలు చెప్పే బీజేపీ.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటు.
-చీగురు శ్రీనివాస్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సిరికొండ మండల యూత్ అధ్యక్షుడు
టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నదని ఓర్వలేకనే ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చే కుట్ర చేస్తున్నది. బీజేపోళ్ల్లది బ్రోకరిజం. టీఆర్ఎస్ను ఎదుర్కోలేక ఎమ్మెల్యేలకు వందల కోట్ల ఆఫర్ ఇస్తామని ప్రలోభపెట్టడం సిగ్గుచేటు. మాటలతో కాలం గడిపే బీజేపీ ప్రభుత్వానికి మునుగోడులో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
-ఎన్నం రాజారెడ్డి,సర్పంచ్, సిరికొండ
బీజేపీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి బేరసారాలు జరపడం సిగ్గుచేటు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు, నాయకులు లొంగరు. దేశంలో 8 రాష్ర్టాల్లో ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చినట్లు తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలని బీజేపీ నీచ రాజకీయం చేస్తుంది. అలాంటి ఆటలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)తో సాగవు.
– గోపీగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కామారెడ్డి
దేశ ప్రధాని మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. కానీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో పసిగట్టి వారి ఎత్తుగడలను తిప్పికొట్టారు. బీజేపీ నాయకులు ప్రజాస్వామ్య విలువలపై అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నారు. వారికి మునుగోడు ఎన్నిక గుణపాఠం అవుతుంది.
– బల్వంత్‌రావు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధికార ప్రతినిధి