నవీపేట,అక్టోబర్ 27: రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ నైజమని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ విమర్శించారు. గురువారం ఆయన బోధన్ నియోజకవర్గంలో ‘మన ఊరు-మన ఎమ్మెల్యే’ కార్యక్రమానికి తన నివాసం నుంచి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ఆయన నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. నాళేశ్వర్‌లో పురాతన రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి ఎండోమెంట్ నుంచి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు.
అంతకుముందు బినోలా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షకీల్ సమక్షంలో గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీని మునుగోడులో భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఒకవేళ ఓడిపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ నీచ రాజకీయాలకు తెరలేపిందని మండి పడ్డారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. మోదీ ప్రభుత్వం అంబానీ, అదానీలతో కుమ్మక్కై కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపించారు. రూ. వందలాది కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చి వేస్తోందన్నారు. ఈ క్రమంలోనే అడ్డదారిలో మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేసిందని గుర్తుచేశారు. వంద మందికిపైగా ఎమ్మెల్యేలను కలిగి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్రపన్నడం దుర్మార్గ చర్య అని అభివర్ణించారు.
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల డబ్బును ఎర చూపి కొనుగోలు చేసేందుకు నీచరాజకీయాలకు పాల్పడుతోందన్నారు. నిజామాబాద్ ఎంపీగా కొనసాగుతున్న ధర్మపురి అర్వింద్ నియోజక వర్గ అభివృద్ధిని మరిచి తన స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్నాడని విమర్శించారు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.రాంకిషన్‌రావు, ఎంపీపీ సంగెం శ్రీనివాస్, జడ్పీటీసీ నీరడి సవిత, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్‌రావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ మాణికేశ్వర్రావు, నవీపేట, బినోలా విండో చైర్మన్లు న్యాలకంటి అబ్బన్న, మగ్గరి హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.