ధర్పల్లి, అక్టోబర్ 26 :జిల్లాలోనే మొట్టమొదటి మధ్యతరహా ప్రాజెక్టు, నాలుగు మండలాల వరప్రదాయిని అయిన ధర్పల్లి మండలంలోని రామగుడు ప్రాజెక్టు జలకళను సంతరించుకొని రెండు నెలలుగా అలుగుపారుతున్నది. ఈ సంవత్సరం వర్షాలు విస్తృతంగా కురవడంతో ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని చెరువులన్నీ నిండి మత్తడి దుంకడంతో లింగాపూర్ వాగు ద్వారా ప్రాజెక్టులోకి భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నది. గత ఏడాది సైతం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి సుమారు నెల రోజుల పాటు అలుగుపారింది. దీంతో యాసంగి పంటకు ఢోకా లేదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏడువేల ఎకరాలకు సాగునీరు..
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో ధర్పల్లి మండలంతోపాటు డిచ్పల్లి, జక్రాన్‌పల్లి, భీమ్‌గల్ మండలాల పరిధిలోని 15 గ్రామాల్లో 7వేల ఎకరాలకు, ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 5,500 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 1,500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది.
సామర్థ్యం పెంపుతో పెరిగిన సాగు విస్తీర్ణం
ఐదువేల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా మూడో పంచవర్ష ప్రణాళికలో నిధులను కేటాయించి 1961జూన్ 12న ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. 1964 జూన్‌లో నిర్మాణాన్ని పూర్తిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు మండలాల రైతులకు ఈ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. 2006లో రూ.19.83 కోట్ల నిధులను కేటాయించి ప్రాజెక్టును ఆధునీకరించారు. ఏడు వేల ఎకరాలకు నీరందించేలా ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచారు.
1278.30 అడుగుల నీటిమట్టం..
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1278.30 అడుగులు కాగా వానకాలం ప్రారంభంలో అత్యల్ప స్థాయిలో నీటిమట్టం కలిగి ఉంది. నెలరోజుల క్రితమే లింగాపూర్ వాగు ప్రవహించి భారీగా ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకున్నది.
గ్రూప్-1 పరీక్షలో ప్రాజెక్టుపై ప్రశ్న..
రామడగు ప్రాజెక్టుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో సైతం రామడుగు ప్రాజెక్టుపై ప్రశ్న వచ్చింది. దీంతో గ్రామస్తులతోపాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాముడు నడయాడిన నేలగా ఈ గ్రామం ప్రసిద్ధి. వనవాస కాలంలో రాముడు పూజలు చేసినట్లుగా చెప్పుకునే చోటే శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించి గ్రామస్తులు పూజిస్తున్నారు.
ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలు
ప్రాజెక్టులోకి కాళేశ్వరం జలాలను మళ్లించేందుకు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కృషి చేస్తున్నారు. మంచిప్ప రిజర్వాయర్ పూర్తయితే అక్కడ నుంచి రామడుగు ప్రాజెక్టులోకి పైప్‌లైన్ ద్వారా కాళేశ్వరం జలాలను మళ్లించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపించి, ఆయకట్టు రైతుల కల సాకారం అయ్యేలా కృషి చేస్తున్నారు. ఈ మేరకు రెండు సంవత్సరాల క్రితమే మంచిప్ప రిజర్వాయర్ నుంచి గడ్కోల్ వరకు 39.6 కిలోమీటర్ల మేర ఏడు సబ్ లింకులతో పంట పొలాలకు పైప్‌లైన్ ద్వారా నీరందించేదు సర్వే చేపట్టి, పనులను సైతం ప్రారంభించారు. ఈ పైప్‌లైన్ ద్వారానే ప్రాజెక్టులోకి నీటిని తీసుకువచ్చే ప్రతిపాదనలను ఎమ్మెల్యే పంపారు. దీంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తినా కాళేశ్వరం జలాలు ప్రాజెక్టులోకి చేరుతాయని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
రామడుగు ప్రాజెక్టే ప్రధాన నీటి వనరు
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడం చాలా సంతోషదాయకం. ఇదే మా గ్రామానికి ప్రధాన సాగునీటి వనరు. వానకాలం పంటలు బాగానే పండాయి. యాసంగి పంటలకు సైతం ఢోకా లేకుండా పోయింది. మత్స్యకారులకు సైతం జీవనోపాధి లభిస్తున్నది. ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
-కె.నవీన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ, ప్రాజెక్టు రామడుగు
ప్రాజెక్టు నిండితే మాకు పండుగే…
ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే రామడుగుతో పాటు ఆయకట్టు పరిధిలోని రైతులందరికీ పండుగే. నాలుగు మండలాల్లోని 15 గ్రామాలకు సాగునీటికి ఢోకా ఉండదు. రామడుగు గ్రామ పరిధిలో అయితే తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెండు మూడు సంవత్సరాలుగా ప్రాజెక్టు పూర్తిగా నిండుతున్నది.
-రమేశ్‌గౌడ్, రైతు, రామడుగు