మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు దూసుకెళ్తున్నారు. తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలకు దీటైన జవాబులిస్తూ వారి నోళ్లు మూయిస్తున్నారు. మనోళ్ల దూకుడు చూసి జాతీయ పార్టీల నాయకులు ఆగమాగమవుతున్నారు. కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రజాప్రతినిధులు, నేతలు సరికొత్త ప్రచార ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, బిగాల గణేశ్ గుప్తా మునుగోడు గడ్డపై గులాబీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వం, సమర్థ పరిపాలనను ప్రచార అస్ర్తాలుగా మార్చుకున్నారు. పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మునుగోడు గడ్డపై ఉమ్మడి జిల్లా నేతల ‘కారు’ స్పీడ్‌ను చూసి ప్రత్యర్థులు నోరేళ్లబెడుతున్నారు.
– నిజామాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు దూసుకుపోతున్నారు. గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దసరా తెల్లారి నుంచి ఆయా ప్రాంతాల్లోనే మకాం వేసిన నాయకులంతా ఏకధాటిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భారత్ రాష్ట్ర సమితిగా మారబోతున్న తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఎన్నికల్లో నిలబడిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు శ్రమిస్తున్నారు. ఎవరికి వారు తమ స్థాయిలో కష్టపడుతూ కారు గుర్తుకు ఓటేసే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దురాఘతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అడుగడుగు నా అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో జరిగిన మార్పును కండ్లకు కడుతున్నారు. ఓటర్లకు పూర్తి వివరాలను పూసగుచ్చినట్లు చెబుతూ తెలంగాణ సర్కారు పాటుపడుతున్న తీరును ప్రజలకు వివరిస్తున్నారు. ప్రధానంగా మునుగోడులో ఫ్లోరైడ్ రక్కసికి చరమగీతం పాడడానికి కేసీఆర్ చేసిన భగీరథ ప్రయత్నాన్ని జనాల్లోకి తీసుకుపోతూ టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తున్నారు.
హుజూర్నగర్ బాటలో…
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వచ్చిన తొలి ఉప ఎన్నిక ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైది యాదిరెడ్డి అఖండ విజయం సాధించారు. కాంగ్రెస్ కంచుకోటలో టీఆర్ఎస్ పార్టీ స్థానం దక్కించుకుని తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం మునుగోడులోనూ గెలుపు ధీమాతో టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్నది. మునుగోడులో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన బడా కాంట్రాక్టర్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ఉప ఎన్నిక అనివార్యమైంది. కేవలం తన స్వార్థ రాజకీయం కోసం ఉప ఎన్నికను తీసుకు రావడం ద్వారా ప్రజలకు వచ్చిన లబ్ధి ఏమీ లేదు. బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఉప ఎన్నిక తీసుకురావడంతో స్థానిక ప్రజలంతా టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టి విజయాన్ని కట్టబెట్టేందుకు నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగా మొదట్నుంచి సర్వేల్లో వెల్లడవుతున్న అనేక ఫలితాల్లోనూ కారు పార్టీయే ముందంజలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు మునుగోడులో స్థానం లేదని నిరూపితం అవుతున్నది హుజూర్నగర్ స్ఫూర్తితో మునుగోడులోనూ గులాబీ జెండా ఎగరడం తథ్యమనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.
ప్రచారంలో ఉమ్మడి జిల్లా నేతలు…
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో మునుగోడుపై ప్రధాన పార్టీలు సీరియస్‌గా దృష్టి సారించాయి. ఇందులో అధికార పార్టీ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామాతో ఏర్పడిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి మరో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని టీ(బీ)ఆర్ఎస్ అధిష్టానం పకడ్బందీగా చేపట్టింది. ఇందులో భాగంగా పలు జిల్లాలకు చెందిన నాయకత్వానికి ప్రచార బాధ్యతలను అప్పగించింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రచార సారథ్యం కల్పించడంతో వారంతా నాలుగు వారాలుగా మునుగోడు నియోజకవర్గంలోనే ఉన్నారు. పండుగలకు ఇంటిముఖం కూడా చూడకుండా సీరియస్‌గా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. చౌటుప్పల్ మండలంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తమకు కేటాయించిన పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చండూర్ మండలంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆర్మూ ర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బాధ్యత నిర్వహిస్తున్నారు. మునుగోడు మండలంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పని చేస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సైతం సామూహిక సమావేశా ల్లో పాల్గొంటూ తమవంతు పాత్ర పోషిస్తున్నారు.
ఫ్లోరైడ్నిర్మూలన అంశంతో ప్రజల్లోకి..
నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నీళ్లతో జీవితాలను బుగ్గి పాలు చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు. లక్షలాది మంది కదల్లేకుండా పడి ఉన్న హృదయవిదారక దృశ్యాలు దశాబ్దాలుగా కండ్ల ఎదుట కనిపించినవే.. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులెవ్వరూ నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేదు. కనీసం ప్రత్యామ్నాయ మార్గం చూపలేదు. 2014లో తెలంగాణ సిద్ధించిన తర్వాత నూతన ప్రభుత్వానికి రథసారథిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రక్షిత మంచి నీటిని ఈ ప్రాంతానికి అందించారు. రూ.వేల కోట్లు వెచ్చించి కుచించుకు పోయిన ఫ్లోరైడ్ బాధితులకు కొత్త జీవితాలను అందించారు. భవిష్యత్ తరాల బతుకులకు కొండత భరోసాను అందించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా తాగు నీటి సౌకర్యం కల్పించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గమే అత్యధికంగా లాభం పొందింది. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ ఇప్పుడు ఇదే ఎజెండాతో ప్రధానంగా ప్రజల్లోకి వెళ్తున్నది. గతంలో పరిపాలించిన కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయని పనిని టీ(బీ)ఆర్ఎస్ పార్టీ మాత్రమే చేసిందన్న విషయాన్ని వాడవాడకూ తీసుకుపోతూ ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారు. ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజలు జై కొడుతూ ఆశీర్వాదాలు అందిస్తున్నారని ఉమ్మడి జిల్లా నేతలంతా చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితిగా మారబోతున్న టీఆర్ఎస్ పార్టీకి గెలుపు ఖాయమైందని మెజార్టీ కోసమే ప్రయత్నిస్తున్నట్లుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు.