దోమకొండ, అక్టోబర్ 26: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గ్రామీణ మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న స్త్రీనిధి, బ్యాంకులింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా చిన్న తరహా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. జిల్లాలో స్త్రీనిధి, బ్యాంకులింకేజీ రుణాల ద్వారా ఎన్నో కుటుంబాల్లో మార్పువచ్చింది.
కామారెడ్డి జిల్లాలో 16,246 సంఘాలు..
జిల్లాలో 16,246 మహిళౠ సంఘాలు ఉన్నా యి. ఇందులో 1,62,717 మంది సభ్యులు గా ఉన్నారు. నెలవారి పొదుపు చేస్తున్నారు. ప్రభు త్వం ప్రతి మహిళను ఆర్థికంగా ఎదిగేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాలను పావలా వడ్డీకి ఇస్తూ అండగా నిలుస్తున్నది. చిన్న, గ్రామసంఘాలకు రుణాలు మంజూరు చేస్తూ స్వయం ఉపాధిలో రాణించేందుకు తోడ్పాటును అందిస్తున్నది. ఒక్కో మహిళకు రూ.50వేల నుంచి రూ.5లక్షల వరకు రుణాలను అందిస్తున్నది. చిన్న,మధ్య తరహా పరిశ్రమలను స్థాపించేందుకు ప్రోత్సహిస్తున్నది.
అతివల ఆర్థిక పరిపుష్ఠి
సంఘాల ద్వారా మంజూరైన రుణాలను తీసుకొని మహిళలు పలు వ్యాపారాలు ప్రారంభించారు. ప్రతి నెలా వాయిదాలు చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కిరాణం, బట్టల దుకాణాలు, పిండి గిర్నీ లు, వాహనాల కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులకు వినియోగం, కులవృత్తుల స్థాపన, పాడిపరిశ్రమ, వ్యవసాయంలో పెట్టుబడితో పాటు ఇతర స్వయం ఉపాధి రంగాల్లో రాణిస్తూ ఆర్థిక పరిపుష్ఠి సాధిస్తున్నారు. ప్రభుత్వం రుణాలు అందిస్తూ అండగా ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వారీగా మంజూరైన రుణాల వివరాలు
స్త్రీనిధి : రూ.156 కోట్లు
బ్యాంకు లింకేజీ : రూ.701 కోట్లు
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు అందిస్తూ అండగా నిలుస్తున్నది. రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రతి మహిళా ఆర్థికంగా ఎదగాలి. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.
-నల్లపు అంజలి, సర్పంచ్, దోమకొండ
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా పని చేస్తున్నాం. డ్వాక్రా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రుణాలు పొందిన వారు స్వయం ఉపాధి రంగంలో రాణిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ప్రతి మహిళనూ ఆర్థిక శక్తిగా తయారు చేస్తాం.
-కవిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు