నిజామాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొన్నేండ్లుగా వాతావరణంలో ఏర్పడుతున్న అలజడితో విపరీతమైన మార్పులు వస్తున్నా యి. తద్వారా వానకాలంలో అతి భారీ వర్షాలు, ఎండాకాలంలో బండలు పగిలేలా ఉష్ణోగ్రతలు, చలి కాలంలో గజగజ వణికిపోయే విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది మాదిరిగానే ఈ సారి శీతాకాలం కాసింత ఆలస్యంగా మొదలైనప్పటికీ అత్యల్ప ఉష్ణోగ్రతలు ప్రజలను వణికిస్తున్నాయి. అక్టోబర్ మొదటి రోజు నుంచే ప్రారంభమయ్యే చలి కాలం 20వ తేదీ వరకు పత్తా లేని పరిస్థితి ఈసారి ఎదురైంది. వానకాలం ఏకంగా అక్టోబర్ మూడో వారం వరకు కొనసాగింది. తీవ్రమైన ఉపరితల ద్రోణి ప్రభావంతో దంచి కొట్టిన వానలతో సర్వత్రా ఆందోళన ఏర్పడిన దుస్థితి కనిపించింది. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో ఎట్టకేలకు ప్రజలకు వానల నుంచి ఉపశమనం కలిగినట్లు అయ్యింది. సమ శీతోష్ణస్థితికి మన భారతదేశం పెట్టింది పేరు. అందులో దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ప్రాంతం అందుకు నెలవు. గ్లోబల్ వార్మింగ్ మూలంగానో కాలుష్య కాటుతో వాతావరణంలో విపరీత పరిస్థితులతోనే కాలానుకూలమైన పరిస్థితులు అప్పుడప్పుడు తలకిందులవుతున్నట్లుగా కనిపిస్తోంది.
16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు…
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలుల తీవ్రతతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయా యి. ఫలితంగా చలి విజృంభించి అందరినీ అల్లాడిస్తోంది. తెల్లవారు జాము నుంచే దట్టమైన చలి గాలులతో పాటు ఆకాశం నేలను తాకినట్లుగా కురుస్తున్న పొగ మంచుతో పరిస్థితి ఒక్కసారిగా భిన్నంగా మారింది. ఉదయం బయటికి వెళ్లేందుకు చిన్నాచితక అంతా భయాందోళనకు గురవ్వాల్సి వస్తున్నది. చేసేది లేక ఉన్ని దుస్తులు ధరించి బయట అడుగుపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. చలి తీవ్రత నాలుగైదు రోజులుగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ కొనసాగుతున్నది. అక్టోబర్ 1వ తేదీన గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అ క్టోబర్ 25న కనిష్ఠ ఉష్ణోగ్రత 16కు చేరింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అవుతున్నది.మధ్యలో వర్షాలు కురిసిన సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకున్న సందర్భాలు అక్టోబర్‌లో ఏర్పడింది.
మొదలైన పొగ మంచు…
తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేస్తున్నది తెల్లవారు జామున రోడ్లపై ప్రయాణం కత్తి మీది సాములా మారింది. ఊర్లల్లో మాత్రం తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతల మూలంగా చలి గాలుల తీవ్రత పెరుగుతున్నది. ఉదయం 10 గంటల వరకూ తీవ్రమైన చలిగాలులు వీస్తుండడంతో చలికి గజగజ వణికిపోవాల్సి వస్తున్నది. రాత్రి వేళల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతున్నది. సాయంత్రం 5 గంటలు దాటితే చాలు… చలి వణికిస్తోంది. వర్షా లు భారీగా కురవడంతో చెరువులన్నీ నీటితో నిండాయి. ఫలితంగా చెరువుల మీదుగా చలి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. మరోవైపు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నా ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువే ఉంటున్నది. అటవీ ప్రాంతానికి తోడుగా… గ్రామాల్లోని జలాశయాల్లో నెలకొన్న జలకళతోనూ ఆయా ప్రాంతాల్లో చలి అందరినీ భయపెడుతున్నది. పొగ మంచు ఓ వైపు ప్రజలకు ఆహ్లాదాన్ని సైతం పంచుతున్నది.
జాగ్రత్తలు తప్పనిసరి…
ఉభయ జిల్లాల్లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉదయం వేళల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం రహదారులను మంచు తెరలు కమ్మేస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతున్నందున జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ము ఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. చలి గాలు లు ఎక్కువగా ఉండే సమయాల్లో ప్రయాణం చేసేటప్పుడు చెవులను నిండుగా కప్పుకునేలా ఏర్పా ట్లు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చలిని తట్టుకునే విధంగా స్వెటర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. నవంబర్‌లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అంచనాలు చెబుతున్నాయి.