లింగంపేట, అక్టోబర్ 18: మారుమూల గిరిజన తండాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ గ్రంథాలయాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశా ఖ అధికారి రాజు సూచించారు. మండలంలోని ముంబాజీపేట తండాలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గ్రంథాలయాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన అంబేద్కర్ పేరును గ్రంథాలయానికి పెట్టడం అభినందనీయం అన్నారు. గిరిజన తండాలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం జిల్లాలోనే మొదటిదని స్పష్టంచేశారు. యువకులు సమయాన్ని వృథా చేయకుండా గ్రంథాలయంలో చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డీఈవో రాజును తండావాసులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముంబాజీపేట తండా సర్పంచ్ లక్ష్మి, ఎంఈవో రామస్వామి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సర్వన్, ఏఎస్సై ప్రకాశ్, కామారెడ్డి గ్రంథాలయ ఆడిటర్ గణపతి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనీరాం, నాగిరెడ్డిపేట మండల అధ్యక్షుడు ప్రకాశ్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత, ఉపాధ్యాయులు పవన్, నవీన, తండావాసులు ఓంకార్, బలరాం నాయక్, దేవీదాస్, పురశురాం, సురేశ్, సర్దార్, నగేశ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల తనిఖీ..
మండలంలోని ముంబాజీపేట తండా ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను డీఈవో రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టికలు పరిశీలించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించిన ఆయన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమం వివరాలను పాఠశాల హెచ్ఎం ప్రవీణ్ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అం దించాలని సూచించారు. ఆయన వెంట స్టాటిస్టికల్ జిల్లా కో-ఆర్డినేటర్ మనోహర్, ఉపాధ్యాయులు ఉన్నారు.