విద్యానగర్, అక్టోబర్ 17 : రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నదని విప్ గంప గోవర్ధన్ అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు. సోమవారం ఆయన దోమకొండ, కామారెడ్డి మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ (రూ.32 లక్షల 3 వేల 712) చెక్కులను ఆయన నివాసంలో పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో 14 మందికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 18 లక్షల 64 వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని 7,698 మందికి (రూ.76 కోట్ల 67 లక్షల 60 వేల 648) కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 1,585 మందికి (రూ.9 కోట్ల 91 లక్షల 65 వేల 800) సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా లక్షా 116 రూపాయలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల ద్వారా అందిస్తున్నారని తెలిపారు. అనారోగ్యం బారిన పడినా, రోడ్డు ప్రమాదాలకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమం త్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. దవాఖానలో ఇచ్చిన పత్రాలను సకాలంలో తమ కార్యాలయంలో ఇస్తే సీఎంఆర్ఎఫ్ నుంచి డబ్బులు ఇప్పించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందు ప్రియ, కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధికార ప్రతినిధి బల్వంత్ రావు, ముప్పారపు ఆనంద్, సబ్బని కృష్ణహరి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.