ఇందూరు, అక్టోబర్ 10 : ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పాఠశాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పక్షం రోజుల్లో పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన పనులన్నీ పూర్తయ్యే పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తొలివిడుతలో ఇప్పటికే ఎంపికైన అన్ని బడులకు నిధులు సమకూర్చామని, చేపట్టిన పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులు సమర్పించిన వెంటనే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని పనులను వేగవంతం చేసి పదిహేను రోజుల్లో పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. పనులు నాణ్యతతో చేపట్టకపోతే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధిహామీ పథకం కింద మంజూరైన పనులన్నీ గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఈలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శాఖల వారీగా పెండింగ్ పనులను పూర్తిచేయించాలన్నారు. వర్ని, రెంజల్ తదితర ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమైనందున ధాన్యం కొనుగోలుకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని అధికారులను ఆదేశించారు.
‘ప్రజావాణి’కి 77 ఫిర్యాదులు
నూతన కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 77 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడించారు. ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జడ్పీ సీఈవో గోవింద్‌లు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.