హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాల పరిధిలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, ప్రభుత్వానికి చెందిన పలు ఆస్తులను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్చార్జి సీఎస్ అర్వింద్ కుమార్ శనివారం హౌసింగ్ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లు, ఖమ్మం మున్సిపల్ కమిషనర్, హెచ్ఎండీఏ సీఈ, ఎస్టేట్ ఆఫీసర్, సీఐవో, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ డీఈ, టీఎస్ఐఐసీ ఎండీతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వేలం ప్రక్రియ ఏర్పాట్లపై మార్గనిర్దేశనం చేశారు. పది జిల్లాల పరిధిలోని 19 ఆస్తులకు నవంబర్ 14వ తేదీన వేలం వేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ఈ నెల 11వ తేదీ నుంచి నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. వేలంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌తోపాటు ప్రభుత్వానికి చెందిన భూములు ఉన్నాయన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఈ-ఆక్షన్ ద్వారా ఆన్లైన్లో, జిల్లాల్లో నేరుగా (ఆఫ్‌లైన్) వేలం ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పారు. ఈ-ఆక్షన్‌ను హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ సంయుక్తంగా పర్యవేక్షిస్తాయన్నారు.
జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో వేలం కొనసాగనున్నదని తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో తొర్రూరు, తుర్కయాంజల్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడలోని ప్లాట్లతోపాటు మహబూబ్‌నగర్‌లోని అమిస్తాపూర్ లేఅవుట్లో ఒక కమర్షియల్ ప్లాట్‌కు వేలం జరుగనున్నది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో చందానగర్, కవాడిపల్లిలోని ఆస్తుల వేలం జరుగుతుంది. వీటికి సంబంధించి పెండింగ్ అనుమతులు, అభివృద్ధి పనులు వంటివాటిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను అర్వింద్ కుమార్ ఆదేశించారు. ప్లాట్లు, లేఅవుట్ల వివరాలతోపాలు సైట్ విజిటింగ్, వేలం ప్రక్రియ గురించి సంబంధిత వెబ్సైట్లలో పొందుపరుచాలని, స్థానిక మీడియాకు ప్రకటనలు ఇవ్వాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా మల్లారం శివారులో ఉన్న 80 ప్లాట్లను చదరపు గజానికి రూ.8వేలు, కామారెడ్డి జిల్లా అడ్లూర్ శివారులో ఉన్న 195 ప్లాట్లను చదరపు గజానికి రూ.ఏడు వేలు, 130 ఇండ్లను చదరపు గజానికి రూ.12వేల చొప్పున వేలం వేయనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 11న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.