మెండోరా/నిజాంసాగర్/ఎడపల్లి/నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 11 : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఎస్సారెస్పీకి లక్షా 75వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండడంతో 30 వరదగేట్లను ఎత్తి దిగువన గోదావరిలోకి 2లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా, ఆదివారం సాయంత్రానికి 1090.90 అడుగుల (89.763 టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగడంతో ఎనిమిది వరద గేట్ల ద్వారా 80,800 క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1404.32 అడుగుల (16.81 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది. ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్లోకి 2వేల క్యూసెక్కుల వరద చేరుతున్నది. మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. ఎగువ నుంచి 20,025 క్యూసెక్కుల వదర వచ్చి చేరుతున్నది.