నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 11: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. భారీ వర్షానికి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ నగరంలోని పలు రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫ్రూట్ మార్కెట్ ప్రాంతంలో భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ధర్పల్లి మండలం వాడి వాగు బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సిరికొండ మండలంలో గడ్కోల్ వద్ద లోలెవల్ బ్రిడ్జి పైనుంచి పారడంతో జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలం గన్నారం నుంచి ఎన్హెచ్-44కు వెళ్లే మార్గం వాగు ఉధృతితో స్తంభించింది.
బోధన్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పాండు చెరువు, చెక్కి తలాబ్ అలుగు పారుతున్నాయి. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో సాలూరా పురాతన వంతెన మీదుగా మంజీరా నది పారుతున్నది. దీంతో బ్రిడ్జి పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. కందకుర్తివద్ద వంతెనను తాకుతూ నది ప్రవహిస్తున్నది. బోధన్ మండలంలోని లంగ్డాపూర్ వాగు, నవీపేట మండలం జన్నేపల్లి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మోర్తాడ్ మండలంలో శెట్పల్లి వద్ద మరోసారి రోడ్డు కోతకు గురికావడంతో ధర్మోరా-శెట్పల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వడ్యాట్ చెరువు నీరు అలుగు పారి రోడ్డుపైకి వచ్చాయి. మొండివాగు, పెద్దవాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో తడ్పాకల్ గోదావరి ఒడ్డున్న ఉన్న బాలాంజనేయ అలయం సగం వరకు నీట మునిగింది. కోటగిరి మండలంలో గర్గువాగు పొంగి పొర్లుతున్నది. రుద్రూర్ మండలంలో వాగు పొంగి ప్రవహించడంతో రుద్రూర్ -బొప్పాపూర్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారుతున్నది. గంగమ్మ ఆలయం చుట్టూ నీరు చేరింది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి సమీపంలో వాగు ఉప్పొంగి పారడంతో రాజంపేట్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మాచారెడ్డి మండలం పాల్వంచ వాగు నిండుగా ప్రవహిస్తున్నది. చుక్కాపూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మంథనిదేవునిపల్లి వద్ద కల్వర్టు, లొట్టి వాగు నిండుగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. గాంధారి మండలం గుజ్జుల్ తండా సమీపంలోని వాగు వంతెనపై నుంచి ప్రవహించడంతో పలు తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి.లింగంపేట మండలంలోని పెద్దవాగు, నల్లమడుగు మత్తడి, పాములవాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి వాగు, సోమారం వాగు, కన్కల్ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యాయి.