నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 11 : కుర్నాపల్లి ప్రధానరోడ్డుపై ఉన్న బాలమ్మ వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మండలంలోని ముత్తకుంట గ్రామపెద్దలు ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌కు విన్నవించారు. సర్పంచ్ జలంధర్‌గౌడ్, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లేశ్ ఆధ్వర్యంలో గ్రామపెద్దలు, నాయకులు హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు.
వాగుపై బ్రిడ్జి నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ ఎగువ ప్రాంతంలో ఉన్న గుట్ట నుంచి వర్షపు నీరు వచ్చి వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని, దీంతో ఆ రోడ్డు గుండా రాకపోకలు నిలిచిపోతున్నాయని తెలిపారు. దీంతో కుర్నాపల్లి, తాడెం, జాన్కంపేట్ మీదుగా నిజామాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం అంచనా వ్యయాన్ని రూపొందించాలని సూచించారు. బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చినట్లు సర్పంచ్ తెలిపారు.