కమ్మర్పల్లి, సెప్టెంబర్ 11 : అలంకృత.. పేరు లాగే ముద్దులొలికే ఎనిమిదేండ్ల చిన్నారి. ఆడుతూ, పాడుతూ తోటి పిల్లలతో అల్లరి చేస్తూ అలరించే చిన్నారిని అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు. ఇలా ఆనందంగా సాగుతున్న అలంకృత జీవితంలోకి లివర్ క్యాన్సర్ మహమ్మారి వచ్చి పట్టుకుంది. దీంతో చిన్నారి అలంకృత ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. తనకు బతకాలని ఉంది బతికించరూ..అంటూ దాతలను చిన్ని చిన్ని చేతులెత్తి అర్థిస్తోంది. తమ కూతురికి ఆపన్న హస్తం అందించి నిండు జీవితాన్ని అందించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ముని మాణిక్యం శిరీషా, అశోక్ దంపతులకు కూతురు అలంకృత, కుమారుడు ఉన్నారు. వీరిది పేద కుటుంబం. శిరీషా బీడీలు చుడుతూ..అశోక్ రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇంట్లో సందడి చేసే చిన్నారి అలంకృత.. కుమారుడిని చూస్తూ కష్టాలను మరిచి పోతూ బతుకు నడుపుకుంటూ వస్తున్న వీరి కుటంబంలో లివర్ క్యాన్సర్ పెను విషాదాన్ని నింపింది. అలంకృతకు లివర్ బ్లాడ్ క్యాన్సర్ సోకింది. దీంతో ఈ పాప తీవ్ర అనారోగ్యం బారిన పడి పోయింది. ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్న తల్లిదండ్రులు అప్పు చేసి అలంకృతకు హైదరాబాద్‌లో రూ.8 లక్షలతో వైద్యం చేయించారు.
కానీ పాడు రోగం పాపను వీడ లేదు. పరిస్థితి విషమించి ప్రాణాపాయ స్థితికి దారి తీసింది. లివర్ పరిస్థితి ఏ క్షణాన పాపకు ప్రాణాల మీదకు వస్తుందో అనేంత తీవ్రంగా సమస్య మారిపోయింది. ఇందుకు ముంబైలోని టాటా క్యాన్సర్ హాస్పిటల్లో తక్షణమే శస్త్ర చికిత్స చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఇందుకు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఒక వైపు క్యాన్సర్‌తో చిక్కి శల్యమవుతున్న కూతురు.. మరో వైపు అంత ఖర్చుతో వైద్యం చేయించ లేని దీనావస్థ.. దీంతో తల్లిదండ్రులు దిక్కు తోచని స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ కూతురిని కాపాడే ఆపన్న హస్తం కోసం ఎదరు చూస్తున్నారు.
దాతలు ఆర్థిక సహాయం అందించి ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు. 9666067861 నంబర్‌కి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం అందించాలని చిన్నారి అలంకృత, తల్లిదండ్రులు రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు. నేనొక్కడిని ఇవ్వక పోతే ఇచ్చే వారు ఎందరో ఉంటారు కదా అని ఆలోచించకుండా పాప బతకాలనే ఆకాంక్షతో అప్పుడే పలువురు దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయం పంపించడం మొదలెట్టారు. అత్యవసర సర్జరీ అవసరం..అందునా భారీ ఖర్చు కాబట్టి మరింత మంది దాతల నుంచి తక్షణ స్పందన అవసరమైన పరిస్థితిలో పాప ఉంది.