నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 11 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పలు గ్రామాల్లో పురాతన ఇండ్లు కూలిపోయాయి. పలు చోట్ల వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.ధర్పల్లి మండలంలోని వాడి గ్రామ వాగు ఉధృతంగా పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కట్టెలు, దుంగలు వాగులోకి వచ్చి చేరడంతో సర్పంచ్ కుమారుడు గంగారెడ్డి తొలగించారు. గ్రామస్తులు వాగువైపు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ధర్పల్లి మండలకేంద్రంలోని పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. ప్రాజెక్టు రామడుగు, వివిధ గ్రామాల్లోని చెరువులు కూడా అలుగులు పారుతున్నాయి. కోటగిరిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు కుండపోతగా వర్షం కురిసింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
సిరికొండ మండలంలోని చెరువులు, కుంటలు నిండాయి. పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గడ్కోల్ వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలంలోని గన్నారం నుంచి జాతీయ రహదారి – 44కు వచ్చే రోడ్డు మార్గం మధ్యలో వాగుపై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు 80.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రోజా తెలిపారు.
చందూర్‌లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లలోకి వర్షపు నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. డిచ్పల్లి మండలంలోని నర్సింగపూర్ గ్రామపంచాయతీ పరిధిలో చిన్నోళ్ల పెద్ద వీరయ్యకు చెందిన పెంకుటిల్లు పైకప్పు కూలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించినట్లు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
రుద్రూర్ నుంచి బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో వాగు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రూర్ కాటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మండల కేంద్రంలో పలువురి ఇండ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఆర్మూర్ పట్టణంతోపాటు నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. మాక్లూర్ మండలంలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ శంకర్ తెలిపారు. బాల్కొండ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భీమ్‌గల్, మండలంలో 72, మోర్తాడ్ మండలంలో 79.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్లు శ్రీధర్, బావయ్య తెలిపారు. బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలంలో 128.8 మి.మీ., కోటగిరి 45.2, బోధన్ మండలం 94.4, వర్ని 63.4, మోస్రా 87.8, ఎడపల్లి 142, రుద్రూర్ 39, చందూర్ మండలంలో 67 మి.మీ. వర్షపాతం నమోదైనట్లురెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఎడపల్లి మండలంలో 8.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
మోర్తాడ్ మండలం ధర్మోరా-శెట్పల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వడ్యాట్ శివారులో చెరువు అలుగునీరు తారురోడ్డుపై నుంచి ప్రవహించడంతో రోడ్డుకోతకు గురయ్యింది. మొండివాగు, పెద్దవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేల్పూర్ మండలం పెద్దవాగు, కప్పలవాగుల్లోకి భారీగా వర్షపు నీరు చేరుతున్నది. బోధన్ మండలంలోని లంగ్డాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
బోధన్ పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకాసీపేట్, సరస్వతీనగర్, శక్కర్‌నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. వేంకటేశ్వర కాలనీలో నిలిపి ఉన్న కార్లు నీట మునిగాయి. పాండు చెరువు, చెక్కి తలాబ్, బెల్లాల్ చెరువులు అలుగుపారుతున్నాయి. ఎస్సారెస్పీ గేట్లు ఎత్తడంతో ఏర్గట్ల మండలం తడ్పాకల్ వద్ద బాలాంజనేయస్వామి ఆలయం నీట మునిగింది. నవీపేట మండలంలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని గురుకులంలోకి వర్షపునీరు చేరకుండా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాష్ట్ర సరిహద్దులోని సాలూరా వద్ద పురాతన వంతెన మీదుగా వరద నీరు ప్రవహిస్తున్నది. బోధన్ డివిజన్లోని హంగర్గా, కొప్పర్గ, భిక్నెల్లి, ఖండ్గావ్ గ్రామాలతోపాటు హూన్సా, ఖాజాపూర్, మందర్నా గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. మంజీర తీర ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఆర్డీవో ఒక ప్రకటనలో సూచించారు. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మండలంలో 128.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాంచందర్ తెలిపారు.వర్ని మండలం సైద్పూర్ తండాలో జగదాంబ దేవి-సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రహరీ కూలిపోయింది.
కోటగిరి, సెప్టెంబర్ 11 : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండింది. ఉన్నతాధికారులు మంజీరా నదిలోకి నీటిని విడుదల చేశారు. మంజీర పరీవాహక ప్రాంతాల వారు నదివైపు వెల్లవద్దని ఎస్సై రాము ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. మండలంలోని కల్లూర్, కొడిచెర్ల, పొతంగల్, హంగర్గా, కారేగాం, సుంకిని గ్రామాల ప్రజలతోపాటు పశువులు, గొర్రెలకాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిజామాబాద్ క్రైం, సెప్టెంబర్ 11 : జిల్లాకేంద్రంలోని అర్సపల్లి ప్రాంతంలో ఉన్న ఫ్రూట్ మార్కెట్ వద్ద ప్రధాన రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ ఎస్సై ఆంజనేయులు సిబ్బందితో కలిసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. బోధన్ బస్టాండ్ నుంచి అర్సపల్లి వైపు వెళ్లే వారికి మరో మార్గంలో వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ సిబ్బంది ఆర్.డి.రమేశ్, సంజీవ్‌కుమార్ తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.