నిజాంసాగర్/ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 10: నిజాంసాగర్ గేట్ల ద్వారా నీటి విడుదలను పెంచాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రాజెక్టు అధికారులకు సూచించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన ఆయన.. అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌లోకి ఇన్‌ఫ్లో పెరిగిందన్నారు. దీంతో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాలకు చెందిన కొన్ని గ్రామాల్లోని మూడు వేల ఎకరాల్లో పంట పొలాలు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో మునిగిపోయాయని తెలిపారు. రైతులు ఎమ్మెల్యేకు సమస్యను వివరించడంతో.. వెంటనే ఆయన నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు.
ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ప్రాజెక్టు ఏఈ శివకుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం ప్రాజెక్టు ఏడు గేట్ల ద్వారా 32వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, అనంతరం దానిని 70వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఫోన్ మాట్లాడారు. ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని తెలిపారు. దీంతో ప్రాజెక్టు గేట్లను మరింత ఎత్తు లేపి లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. వెంటనే స్పందించి నీటి విడుదల పెంచేలా కృషిచేసిన ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రప్రభుత్వంపై ఎమ్మెల్యే ఫైర్..
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నదని, దీన్ని చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో మత విద్వేషాలను సృష్టించాలని చూస్తోందని ఎమ్మెల్యే మండిపడ్డారు. కానీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గమనిస్తున్నారని, ప్రజలందరూ గులాబీ పార్టీ వెంటే ఉన్నారన్నారు. మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఇటీవల నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ సభకు హాజరైన ప్రజలే ఇందుకు నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దుర్గారెడ్డి, ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ కుడుముల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింహులు, టీఆర్ఎస్ ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు సతీశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ప్రాజెక్టును పరిశీలించిన ఎంపీపీ..
నిజాంసాగర్ ప్రాజెక్టును ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి శనివారం సందర్శించారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో చిన్నపూల్ వంతెన పైనుంచి నీరు ప్రవహించింది. దీంతో నవోదయ పాఠశాల, అచ్చంపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. విషయాన్ని ఎంపీపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వియర్ నంబర్ 12 ద్వారా నీటి విడుదలను తగ్గించి వియర్ నంబర్ 16 ద్వారా నీటిని విడుదల చేయాలని సూచించారు. ఆమె వెంట నాయకులు దుర్గారెడ్డి, రమేశ్, ఏఈ శివకుమార్ తదితరులు ఉన్నారు.