మొన్న… మహిళా ఆచార్యురాలిపై అసభ్య పదజాలంతో వైస్ చాన్స్‌లర్ దూషణ. తాను చెప్పిందే వినాలంటూ హుకం. కాదని చెప్పిన పాపానికి బూతు పురాణం అందుకోవడంతో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్ పోస్టులో కొనసాగుతున్న ప్రొఫెసర్ త్రివేణి కన్నీటి పర్యాంతం. ఓ సామాజిక వర్గానికి చెందిన వారంతా వీసీ తీరును ఖండించి క్షమాపణలు కోరారు. వీసీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
నిన్న… యువతుల హాస్టల్ గదుల్లోకి ఎవరు పడితే వారు వెళ్లడానికి వీలులేదు. పురుషులకు అస్సలే అనుమతి లేదు. వైస్ చాన్స్‌లర్ హోదాలో ఉన్న రవీందర్ గుప్తా గురువారం రాత్రి నేరుగా హాస్టల్ డోర్ తీసుకొని లోపలికి వెళ్లారు. తనతో డాన్సు చేయాలంటూ హుకుం జారీ చేసి విద్యార్థినులతో కలిసి డీజే పాటలకు స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా వారిపై కరెన్సీ నోట్లను చల్లారు. ఇదంతా ఆయనతోపాటు అక్రమంగా హాస్టల్ లోనికి ప్రవేశించిన ప్రైవేటు వ్యక్తులు వీడియో తీశారు. అది కాస్తా బయట పడటంతో వీసీ తీరుపై సర్వత్రా దుమ్మెత్తి పోస్తున్నారు. యువతుల హాస్టల్లోకి వచ్చిన ప్రైవేటు వ్యక్తుల్లో వీసీ బంధువులు ఉన్నట్లు తెలిసింది.
నిజామాబాద్, సెప్టెంబర్ 10, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన తొలి రోజు నుంచి నేటి వరకు రవీందర్ గుప్తా తీరు తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో మరెక్కడా ఏ విశ్వవిద్యాలయంలో వెలుగు చూడని చీకటి అంశాలకు టీయూ కేరాఫ్‌గా మారుతోంది. నిత్యం వివాదాల సుడిగుండంలో చుట్టుకొని ప్రతిష్టనే దెబ్బతింటోంది. వీసీ స్థానంలో కూర్చున్న వ్యక్తి అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుండడంతో విద్యార్థులు, ఆచార్యులు, ప్రజాప్రతినిధులు, సామాన్య జనం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ ఛీత్కరిస్తున్నారు. రిజిస్ట్రార్ల మార్పు, అక్రమ నియామకాలు, ప్రమోషన్లు, కోర్టు ధిక్కరణలు, ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనలు, విద్యార్థి సంఘాలపై చిర్రుబుర్రులు, ఆచార్యులపై తిట్ల దండకాలతో వీసీ రవీందర్ గుప్తా.. విశ్వవిద్యాలయాన్ని ఏం చేయదల్చుకున్నడో ఎవరికీ అర్థం కావడం లేదు.
బారాఖూన్ మాఫ్..
తెలంగాణ యూనివర్సిటీలో వీసీ బరితెగించారు. ఎవరు ఏమైనా అనుకోని నాకేం… అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. 16నెలల్లో తనకు ఏది నచ్చితే ఆ పని చేసేస్తున్నారు. అందుకు నిబంధనలు సహకరిస్తాయా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. అందులో అమ్యామ్యాలు ఉన్నాయని తెలిస్తే బారాఖూన్ మాఫ్. ఎంతటి పనికి మాలిన వ్యక్తికైనా యూనివర్సిటీలో కుర్చీ వేసి ఉద్యోగాలు ఇచ్చేస్తాడు. ఇందుకోసం తనకు నచ్చిన వ్యక్తులను అప్పటికప్పుడు రిజిస్ట్రార్లుగా పెట్టేసుకుంటాడు. లేదంటే డిపార్ట్మెంట్ హెడ్లను మార్చేస్తాడు. తాను చేసేదంతా నిజాయతీ అన్నట్లుగా బహిరంగంగానే ఉత్తర్వులు జారీ చేస్తున్నాడు. పాలకవర్గం అన్నది ఆయనకు అస్సలు పట్టదు. ప్రభుత్వ నిబంధనల జోలికి వెళ్లడు. మాటకు వంకర జవాబు ఇచ్చినా… కాదని సమాధానం చెబితే ఇక ఎదురు ఉండాల్సిన వ్యక్తి వెనక్కు వెళ్లి పోవాల్సిందే. ఇలాంటి పద్ధతులతోనే 14నెలల్లో ఐదుగురు రిజిస్ట్రార్ల మార్చారు. లెక్కకు మించి ప్రమోషన్లు, నియామకాలకు అడ్డూ అదుపు లేదు. వీసీ తలచుకుంటే బారాఖూన్ మాఫ్ అన్నది ఇప్పుడిక్కడ ట్రెండ్‌గా మారుతోంది.
ఇష్టారీతిన జీతాల పెంపు
యూనివర్సిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా పాలకవర్గం అనుమతి తప్పనిసరి. ఉద్యోగుల జీతాల పెంపు, ప్రమోషన్లు, జమ, ఖర్చు వివరాలతో కూడిన ఆర్థికపరమైన అంశాలుంటే ఈసీ మీటింగ్‌లో ఆమోదం తెలిపిన తర్వాతనే వీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం వీసీ రవీందర్ గుప్తాకు తెలియంది కాదు. గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతూ ఈసీ మీటింగ్‌లో ఉన్నత విద్యా శాఖ కాలేజియేట్ కమిషనర్ నవీన్ మిట్టల్ స్వయంగా హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినప్పటికీ తీరు మారడం లేదు. ఆగస్టు 26, 2022న ఓ ఉత్తర్వును జారీ చేశారు. కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న ప్రోగ్రామర్‌కు రూ.40వేలు ఉన్న జీతాన్ని రూ.52వేలు చేశారు. రిజిస్ట్రార్ విద్యావర్థిని సైతం సంతకం చేసి ఉత్తర్వు విడుదల చేశారు. వీసీ ఆదేశాలతో కింది స్థాయి అధికారులు సైతం ఆర్డర్ రిలీజ్ చేసి అక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఇలా ఏక కాలంలో 9 మందికి అడ్డగోలుగా జీతాల పెంచినట్లు సమాచారం. ఇందుకోసం పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్లు తెలిసింది. పాలకవర్గాన్ని నిస్తేజంలో పెట్టి వీసీ తాను ఆడిందే ఆట… పాడిందే పాట అన్నట్లు వ్యవహరిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.