ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 7 : వయసు పైబడిన వారు, పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పింఛన్ అందిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దేశంలో పెద్ద మొత్తంలో పెన్షన్ అందిస్తున్నది మన రాష్ట్రంలోనే అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు కార్డులను అందజేశారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..
నిజామాబాద్ అర్బన్‌లో కొత్తగా తొమ్మి ది వేల మందికి, జిల్లాలో 50వేల మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. నగరంలో 60వేల ఇండ్లు ఉంటే 40వేల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. దేశంలో పెద్ద మొత్తంలో పింఛన్లు అందిస్తున్నది మన రాష్ట్రమే అని తెలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఎంతిస్తున్నారో ఆ రాష్ట్రంతో అనుబంధం ఉన్నవారికి తెలుసన్నారు. తెలంగాణ రాకముందు రూ.200 ఉంటే.. రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. వెయ్యి నుంచి పెన్షన్ మొదలుపెట్టినట్లు వివరించారు. పేదల ఆశీర్వాదంతో బంగారు తెలంగాణ సాకారమవుతుందన్నారు. సంపద సృష్టించే రాష్ట్రంగా దేశంలోనే నంబర్ వన్ స్థాయి చేరుకుంటుందన్నారు. పెన్షన్ రాని వారికి త్వర లో వస్తుందన్నారు.
తెలంగాణకు వచ్చి పంచాయితీ పెట్టుకున్న కేంద్ర మంత్రులు
ఇటీవల కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ షాపులో ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదని అడిగారని, ఎక్కడైనా రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలు పెడుతారా? అని ప్ర శ్నించారు. కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి పంచాయితీ పెట్టుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను ఆగం పట్టించే ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఉచిత పథకాలపై చర్చ మొదలుపెట్టిందని, యువకులు, మహిళలు సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేసే తప్పుడు ప్రచారాలపై జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. పేదరికం లేని తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌ను దేవుడు చల్లగా చూడాలని మనందరం వేడుకుందామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, రెడ్కో మాజీ చైర్మన్ అలీమ్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు తదిత రులు పాల్గొన్నారు.