ఇందూరు, సెప్టెంబర్ 5 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. పచ్చని మొక్కలు, ఫౌంటేన్లు, పూలసోయగాలతో ప్రకృతి రమణీయతను తలపించిన నూతన కలెక్టరేట్‌ను చూసి సీఎం సం తోషం వ్యక్తం చేశారు.
అంతకుముందు ఆయన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి బస్సులో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, కలెక్టర్ నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి నూ తన సమీకృత కలెక్టరేట్ భవనానికి భారీ బందోబస్తు మధ్య చేరుకున్నారు. కలెక్టరేట్ గేట్ వద్ద బారికేడ్ల పక్కన సభా ప్రాంగణంలోకి వెళ్లే ప్రజలు, కార్యకర్తలు పోలీసులు వద్దన్నా వినకుండా సీఎం కేసీఆర్‌ను చూడాలంటూ పట్టుబట్టారు. కేసీఆర్ బస్సులో రాగానే జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
వారికి కేసీఆర్ అభివాదం చేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలోకి రాగానే ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్ణకుంభంతో వేదపండితులు ఘన స్వాగతం పలికారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కేసీఆర్ ఆప్యాయంగా దగ్గరకు పిలుచుకొని అన్ని కార్యక్రమాల్లో దగ్గరుండి సరస్వతీ పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని తన చాంబర్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కలెక్టర్‌ను ఈ సందర్భంగా అభినందించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాలులో ప్రభుత్వాధికారులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అందరి సమైక్య కృషితో రాష్ట్రం దేశంలోనే అనేక రంగాల్లో పురోగమిస్తోందని అన్నారు. క్వెస్ట్ ఫర్ ఎక్స్‌లెన్స్ అంటే ఒక ప్రయత్నం, ఒక ప్రారంభం, ఒక ప్రస్థానం ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రగతిని సాధిస్తుందని వివరించారు. ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న అమెరికాలోనూ అక్కడుండాల్సిన సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు. మరింత పట్టుదల, కృషి, ఐక్యతతో మనమంతా పని చేస్తే రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు.