కమ్మర్పల్లి, సెప్టెంబర్ 5 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభకు ఉమ్మడి జిల్లాల నుంచి జన ప్రవాహం కొనసాగింది. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా జనరంజక పాలన అందిస్తున్న తమ నేత కేసీఆర్ సభకు ఉమ్మడి జిల్లాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. జిల్లా సమీకృత నూతన కలెక్టరేట్ కార్యాలయ భవనం, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పెట్టిన గులాబీ పార్టీ భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన టీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఉమ్మడి జిల్లా పల్లెలన్నీ కదిలివచ్చాయి. ప్రజల వాహనాలు రహదారుల వెంట బారులు తీరాయి. మధ్యాహ్నానికే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సీఎం రాక కోసం సభాస్థలి వద్ద జనం ఆసక్తిగా ఎదురు చూశారు. సభా ప్రాంగణం వైపు చేరుకునే దారులన్నీ అభిమాన జనంతో నిండుగా కనిపించాయి. సభా ప్రాంగణం కిక్కిరిసి పోవడంతో బయట నుంచి సైతం సీఎం ప్రసంగాన్ని వీక్షించారు.
సీఎం సభ విజయవంతానికి పార్టీ నేతలు, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన కృషి… కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు ఉత్సాహంగా సభకు హాజరయ్యారు. కులవృత్తుల వారు, వృద్ధులు, యువత భారీగా తరలివచ్చారు. నెమళ్ల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, బ్యాండ్‌మేళాలతో తమ అభిమానాన్ని సభ రాకలో చాటుకున్నారు.
గిరిజనులు ప్రత్యేక అభిమానంతో సభ వద్ద సందడి చేశారు. అన్నివర్గాల ప్రజలతో సభా ప్రాంతం జనజాతరను తలపించింది. సభలో కళాకారులు ఆలపించిన తెలంగాణ ఆట పాటలతో సభలో జనం గులాబీ జెండాలు రెపరెపలాడిస్తూ కేసీఆర్ పాలనకు, టీఆర్ఎస్ పార్టీకి సంఘీభావం వ్యక్తం చేశారు.
కేసీఆర్ దేశానికి దారి చూపాలి
తెలంగాణను దేశమంతా మెచ్చుకునేలా తీర్చిదిద్దిన కేసీఆర్ దేశానికి సైతం దారి చూపాలి. దేశంలో నాలాగా ఎంతో మంది కోరుకుంటున్నారు. ఇది నిజం కావాలని నేను కల కంటున్నాను. కేసీఆర్ దీన్ని తప్పకుండా సాధ్యం చేసి చూపగలరు.
-లక్ష్మణ్, మదన్‌పల్లి, మాక్లూర్ మండలం
సీఎం సాబ్ అందరివాడు
కేసీఆర్ సార్ అందరి మనిషి. అందరి సంతోషం కోరుకుంటాడు. అన్ని మతాలు, కులాల వారు కలిసిమెలిసి ఉండాలంటాడు. అందుకే కేసీఆర్ పాలన అందరికీ నచ్చుతుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం అన్నివర్గాల వారు సంతోషంగా కలిసిమెలిసి జీవించేలా పరిపాలన ఉంటుంది.అందుకే కేసీఆర్ సభకు అభిమానంతో వచ్చాం.
-సయ్యద్ జాకీర్, కమ్మర్పల్లి