వర్ని, ఆగస్టు 24: కొందరు అధికార దాహంతో రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలో పర్యటించారు. రూ.35లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆదర్శ మహిళా మండలి భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం లబ్ధిదారులు నిర్మించుకున్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, గృహ ప్రవేశం చేయించారు. దీంతోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 91మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశారు. దళిత బంధు కింద మంజూరైన ఎలక్ట్రికల్ షాపును ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, అశాంతి నెలకొల్పేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. అల్లర్లు చేసేవారు ఎంతటివారైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించబోదని, పోలీసులు శాంతి యుత వాతావరణం నెలకొల్పేందుకు ఎవరిపైనైనా కేసులు నమోదు చేస్తారన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని హితవుపలికారు. ఉచితాలు ఇవ్వొద్దు, రైతుల మోటర్లకు మీటర్లు పెట్టండి అంటూ సీఎం కేసీఆర్‌పై కేంద్రం ఒత్తిడి తెస్తోందన్నారు.
నిరుపేదలకు ఉచితాలు, సబ్సిడీలు అవసరమని, ఆదాని, అంబానీలకు కాదన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా తలొగ్గేదే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 28లక్షల పెన్షన్లు ఇస్తున్నామని, కొత్తవాటితో కలిపి ప్రస్తుతం 48 లక్షల పెన్షన్లకు 15వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వర్నిలో మహిళా మండల భవన నిర్మాణం కోసం మరో రూ.15 లక్షలు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మూడ్ కవితా అంబర్‌సింగ్, వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, మండల కో -ఆప్షన్ సభ్యుడు కరీం, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయి బాబా, ఉప సర్పంచ్ కంది కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, ఎంపీటీసీ చోడె వెంకట రమణి, మహిళామండలి అధ్యక్షురాలు మార్ని కనకమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల సందర్శన
బాన్సువాడ రూరల్, ఆగస్టు 24 : బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బుధవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. సెప్టెంబర్ 1,2వ తేదీల్లో కళాశాలకు న్యాక్ బృందం రానున్న నేపథ్యంలో సభాపతి సందర్శన ప్రాధాన్యం సంతరించుకున్నది. కళాశాలలోమౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్ గంగాధర్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. న్యాక్ బృందం కళాశాలకు ‘ఏ’ గ్రేడ్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పీకర్ వెంట ఆర్డీవో రాజాగౌడ్, బాన్సువాడ సొసైటీ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, పీఏ భగవాన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.