నిజామాబాద్ క్రైం, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీస్ శాఖలో నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుందని, ఇందుకోసం సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇస్తామని రాష్ట్ర అదనపు డీజీపీ, నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం బాసర జోన్‌లోని నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బంది సర్వీసు, ప్రమోషన్లపై జిల్లాల వారీగా వివరాలను సేకరించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. అన్ని పోలీస్ స్టేషన్లలో 5ఎస్ విధానం అమలులో ఉండేలా చూడాలన్నారు. కేసులను ఛేదించడంలో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంజాయి, మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘాను పటిష్టం చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలను కంట్రోల్ చేయడంలో సిబ్బంది కృషిని అభినందించారు. అంతకుముందు ఆయనకు నాలుగు జిల్లాల అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఏఆర్ సిబ్బంది నుంచి ఐజీ గౌరవ వందనం స్వీకరించారు. సమావేశంలో సీపీ నాగరాజు, ఎస్పీలు సింధూశర్మ, ఉదయ్‌కుమార్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ డీసీపీ డాక్టర్ వినీత్, రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.