నిజామాబాద్ సిటీ, మార్చి 16 : దళితబంధు యూనిట్ల ఎంపికతోపాటు వాటిని తమకు నచ్చిన చోట స్థాపించుకునే పూర్తి స్వేచ్ఛ లబ్ధిదారులకు ఉందని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో లబ్ధిదారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత కుటుంబాలు ఆర్థిక అభ్యున్నతి సాధించాలన్నదే దళతిబంధు ముఖ్య ఉద్ద్దేశమని అన్నారు. ఎంచుకున్న వ్యాపారాన్ని లబ్ధిదారులు స్వయంగా నిర్వహిస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చని, ప్రభుత్వం అందిస్తున్న పెట్టబడికి, శ్రమను జోడిస్తూ పనిచేస్తే తప్పనిసరిగా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటామని అన్నారు. తొలిదశలో జిల్లాలో 550మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా అందులో 340పైగా మంది వాహన యూనిట్లను ఎంపిక చేసుకున్నారని, ఈ కారణంగా వాహనాల వినియోగానికి డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్లో డెయిరీ, ఫౌల్ట్రీ, ఇటుకల తయారీ, సెంట్రింగ్, శానిటరీ వంటివాటికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఏప్రిల్ మొదటివారంలో యూనిట్ల స్థాపనకు శ్రీకారం చుట్టనున్నందున నెలకొల్పబోయే వ్యాపారంపై సమగ్ర అవగాహనను ఏర్పర్చుకోవాలని, ఎలాంటి సందేహాలున్నా అధికారులను సంప్రదించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.