ఖలీల్‌వాడీ(మోపాల్), జూలై 16 : ప్రేమించడం లేదని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. బీరుసీసా పగులగొట్టి యువతి గొంతు కోసి పరారయ్యా డు. మోపాల్ మండలంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి కథనం మేరకు.. మోపాల్ మండలంలోని చిన్నాపూర్కు చెందిన ప్రియాంక (19) ఇంటి వద్దే ఖాళీగా ఉంటుంది. రెండేళ్ల క్రితం జరిగిన పెద్దనాన్న కుమారుడి పెళ్లిలో మాక్లూర్ మండలం మానిక్‌భండార్‌కు చెందిన సంజయ్ (22) పరిచయమయ్యాడు. అప్పటి నుంచి ప్రియాంకపై ప్రేమ పెంచుకున్న అతడు.. తనను పెళ్లి చేసుకోవాలని వెంట పడ్డాడు.
ఒప్పుకోవడం లేదని గతంలో యువతితో పాటు ఆమె తల్లిపైనా దాడి చేశాడు. అయితే, బాధితులకు అండ గా ఎవరూ లేకపోవడంతో పెద్ద మనుషు లు సమస్యను సర్దుమణిగించేశారు. అయితే, ఈ నెల 14న తన పుట్టిన రోజు ఉందని మోపాల్‌కు వచ్చిన సంజయ్.. ప్రియాంకను బతిమాలి వెంట తీసుకెళ్లాడు. కులాస్పూర్-చిన్నాపూర్ గ్రామాల మధ్య నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో పక్కనే ఉన్న బీరు సీసాను పగులగొట్టి యువతి గొంతు కోసి పరారయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున అటువైపు వెళ్తున్న వారు అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను చూసి వారి బంధువులకు, గ్రామస్తులకు సమాచారమిచ్చారు. స్థానికులు వచ్చి హుటాహుటిన ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సంజయ్‌ను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.