ఇందూరు, జూలై 16 : భారీవర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లతోపాటు విద్యుత్, ఇతర సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో శనివారం సెల్కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల ప్రగతిపై ఆరాతీశారు. శాఖల వారీగా చేపడుతున్న పనులపై ఆరా తీశారు. భారీవర్షాలతో జిల్లాలో 14 చోట్ల ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతినగా, ఇప్పటికే వాటిలో 10 చోట్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు సంబంధిత అధికారులు వివరించారు. మిగతా ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచి ఉన్నందున మరమ్మతు పనులు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్లకు సైతం త్వరితగతిన మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కలెక్టర్ సూచించారు.
వర్షాలతో విద్యుత్ వ్యవస్థకు పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని, 468 స్తంభాలు పడిపోయాయని, 198 ట్రాన్స్ఫార్మర్లు గోదావరి నీటిలో చిక్కుకొని ఉన్నాయని, మరో నాలుగు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయని ట్రాన్స్కో ఎస్ఈ రవీందర్ కలెక్టర్కు వివరించారు. విద్యుత్ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.
ఆదివారం సెలవుతీసుకోకుండా అధికారులు, సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించారు. వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ సరఫరాను త్వరగా అందజేయాలన్నారు. సోమవారం నాటికి విద్యుత్ సరఫరా సాధారణ స్థాయికి వచ్చేలా మరమ్మతు పనులు చేయించాలని సూచించారు. వ్యవసాయ వీస్తీర్ణాధికారులు తమ పరిధిలో విద్యుత్ పునరుద్ధరణ పనులను పరిశీలించి, పెండింగ్లో ఉన్న వివరాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు.