నిజామాబాద్ క్రైం, జూలై 10: నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని కొత్తపేట్ శివారులో నిజాంసాగర్ కెనాల్ గల్లంతైనవారిలో ఒకరి మృతదేహం ఆదివారం లభించింది. పశువులను మేపేందుకు వెళ్లిన లింగితండాకు చెందిన నడిపి సాయిలు(45), దారంగుల రెడ్డి(38) వరద ప్రవాహానికి శనివారం సాయంత్రం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇందులో మక్కల సాయిలు మృతదేహం దొరికింది. గ్రామస్తులు, పోలీసులు అదేరోజు చీకటిపడేవరకు గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. తిరిగి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. తహసీల్దార్ సుదర్శన్, ఎస్సై లింబాద్రి ఆధ్వర్యంలో ఫైర్, ఫిషరీస్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టగా, సాయిలు మృతదేహం లభించింది. దారంగుల రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం మరింత పెరగడంతో రెస్క్యూ బృందాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
బాధిత కుటుంబాలకు ఆర్టీసీ చైర్మన్ పరామర్శ
నిజామాబాద్ రూరల్, జూలై 10 : నిజాంసాగర్ ప్రధాన కాలువలో గల్లంతైన నడిపి సాయిలు, దారంగుల రెడ్డి కుటుంబాలను ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదివారం పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు, అధికారులతో మాట్లాడి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా ఉండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆయన వెంట టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఈగ సంజీవ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మధుకర్‌రావు, సర్పంచ్ అరుణా సాయిలు, సీఐ నరేశ్, అధికారులు, నాయకులు ఉన్నారు.
కరెంట్ షాక్‌తో ఒకరి మృతి
మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన దుబాశి సాయిలు(45) ఆదివారం కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాయిలు ఇల్లు ఉరుస్తుండగా, ఇంటి పైన ఓ ప్లాస్టిక్ కవర్‌ను కప్పేందుకు పైకెక్కాడు. విద్యుత్ తీగ తగిలి ప్రమాదం జరిగింది. దీంతో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య కల్పన, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మాతు సంగెం వాగులో కొట్టుకు పోయిన బర్రెలు..
మండలంలోని మాతు సంగెం గ్రామంలో మేతకు వెళ్లిన ఆరు బర్రెలు వాగును దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకు పోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆదివారం ఉదయం వాగు పరిసరాల్లో గాలిస్తుండగా పట్లోల్ల రామరావుకు చెందిన ఒక బర్రె కళేబరం దొరికిందని చెప్పారు. మిగిలిన వాటికోసం వాగు పరిసరాల్లో గాలిస్తున్నారు.